ఆయన పదాలు కడితే పాటతల్లి పులకరిస్తుంది. ఆ పాట వింటుంటే హృదయాలు పరవశిస్తాయి. ఆయన పాటలెప్పుడూ ప్రకృతి, జనంతో మమేకమై ఉంటాయి. ఉత్తేజం, ఉక్రోషం, ఆవేదన, నిరసన.. ఇలా అన్నీ ఆయన పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ముందుకు నడిపించారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర గీతకర్త, పాటల రచయిత అందెశ్రీ. సోమవారం (నవంబర్ 10) నాడు అందెశ్రీ ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయన గురించి ఈ ప్రత్యేక కథనం..
అందెశ్రీ పేరెలా వచ్చింది?
అందెశ్రీ (Ande Sri).. 1961 జూలై 18న జన్మించారు. ఈయన అసలు పేరు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహారాజ్.. ‘బిడ్డా.. కాళిదాసు, తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అందె శ్రీవి' అని ఆశీర్వదించారు. అలా ఆయనకు ఈ పేరు వచ్చింది.
పుస్తకాల్లోకెక్కిన పాట
పేరుకు తగ్గట్లుగానే ఆయన కలం నుంచి వచ్చే కవిత్వం, పాటలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి. బడి ముఖం చూడకపోయినా సమాజాన్ని, ప్రకృతిని అందరికంటే ఎక్కువ చదివేశారు. ఎర్ర సముద్రం సినిమాలో 'మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..' పాటతో హృదయాలు మెలిపెట్టేశారు. తర్వాత ఈ పాట పాఠ్యాంశంగానూ మారడం విశేషం! గంగ సినిమాలో 'వెళ్లిపోతున్నావా..' పాటకుగానూ ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు తీసుకున్నారు.
మనకంటూ పాట లేదా?
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అందెశ్రీకి ఓసారి స్టేజీ ఎక్కినప్పుడు మొదట ఏ పాట పాడాలో అర్థం కాలేదు. అప్పుడే మనకంటూ ఓ పాట లేదా? అన్న ప్రశ్న మనసును తొలిచేసింది. అలా 'జయ జయహే తెలంగాణ పాట' పురుడు పోసుకుంది. ఈ పాట స్టేజీపై పాడిన తొలిసారే.. వెనకనుంచి ఎవరో ఇది తెలంగాణ జాతీయగీతం అన్నారు. వెక్కిరిస్తున్నారేమో అని అందెశ్రీ భయపడ్డారు. కానీ, తర్వాత అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా కీర్తికెక్కింది.
పాటకు ప్రాణం
'పల్లె నీకు వందనాలమ్మో..', 'కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా' అంటూ ప్రకృతికి, మన జీవన విధానానికి చేతులెత్తి మొక్కుతారాయన. 'జన జాతరలో మన గీతం.. జయకేతనమై ఎగరాలి.. ఝంఝా మారుత జననినాదమై జేగంటలు మోగించాలి..' అంటూ జైబోలో తెలంగాణలో రాసిన పాట అందరు పిడికిలి బిగించి మరింత గట్టిగా, ధైర్యంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఒకటే జననం, ఒకటే మరణం.. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తెలంగాణ సాధించడం ఒక్కటే మన కర్తవ్యం అంటూ పాటతోనే జనాన్ని ముందుకు నడిపించారు. ఎవరు రాయగలరు ఇంతకంటే గొప్ప గీతం అనిపించేలా పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి!
చదవండి: అందెశ్రీ కన్నుమూత


