సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) తుదిశ్వాస విడిచారు (Ande Sri Death). ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:25 గంటలకు అందెశ్రీ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాంలోని రేబర్తిలో జూలై 18, 1961లో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీకి ముగ్గరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా నగదు పురస్కారం అందుకున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ, ప్రకృతి వంటి అంశాలపై అందెశ్రీ గేయరచన చేశారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచనలు ప్రజలలో చైతన్యం నింపాయి. ఆయన రచనలు, పాటలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో నకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.


