ఆ రెండు కుటుంబాల్లో ఒకేసారి చీకట్లు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదం.. వాళ్ల ఏకైక బిడ్డలను బలిగింది. బాల్యమిత్రులైన ఇద్దరు స్నేహితుల జీవిత ప్రయాణం అనూహ్యంగా.. అర్ధాంతరంగా ముగిసిపోయింది.
సాక్షి, కామారెడ్డి: మాచారెడ్డి మండలం లచ్చాపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. జక్కుల సాయికిషోర్(21), మిరిదొడ్డి అజయ్(21) అనే స్నేహితులు గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారు తమ కుటుంబాలకు ఏకైక కుమారులే. యువకుల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి చౌరస్తా నుంచి లచ్చాపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిద్దరూ శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మొదట సాయికిషోర్, తర్వాత కొంతసేపటికి అజయ్ మరణించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. బాధితుల్లో ఒకరి కాలి ఎముక.. ఆ లారీ చక్రానికి తగిలి టైరు పంక్చర్ అయ్యిందంటే.. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!. అందుకే అతివేగం అత్యంత ప్రమాదం అని చెప్పేది.


