కంగనా vs తాప్సీ..ఈసారి తల్లిదండ్రుల వరకు వెళ్లిన వివాదం! | Kangana Ranaut Slams Taapsee Pannu As Old Feud Erupts Again Over Controversial Remarks, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కంగనా vs తాప్సీ..ఈసారి తల్లిదండ్రుల వరకు వెళ్లిన వివాదం!

Aug 23 2026 12:23 PM | Updated on Aug 23 2026 1:25 PM

Kangana Ranaut slams Taapsee Pannu

మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పే హీరోయిన్లలో  కంగనా రనౌత్, తాప్సీ పన్ను ముందు వరుసలో ఉంటారు. సినిమాల ఎంపిక దగ్గరి నుంచి వ్యక్తిగత అభిప్రాయాల వరకు ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడే ఈ ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలకు కంగనా ఘాటుగా స్పందించడంతో వీరి మధ్య వార్ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ.. కంగనాతో తనకున్న విభేదాలపై మాట్లాడారు. వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తాను కంగనాను వ్యక్తిగతంగా కలవలేదని చెప్పారు. కంగనాపై తన అభిప్రాయం తన పెంపకం, మాట్లాడే విధానం, ఆలోచనా తీరును ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కంగనా ఎలా స్పందిస్తారనేది ఆమె పెరిగిన వాతావరణం, ఆమె విధానానికి సంబంధించిన విషయమని తాప్సీ పేర్కొన్నారు.

తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగనా రనౌత్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తాప్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం, మీడియా హెడ్‌లైన్స్‌లో నిలిచేందుకు తాప్సీ తన పేరును ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ఈసారి తాప్సీ తన పెంపకం, తల్లిదండ్రుల గురించి ప్రస్తావించడంతో కంగనా కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు.

తాప్సీని ఉద్దేశించి కంగనా ‘చౌకబారు కాపీ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ద్వారా తాప్సీ హద్దులు దాటారని పేర్కొంటూ.. తాను మాత్రం ఎలాంటి వాదనలోనూ ఎదుటివారి తల్లిదండ్రుల గురించి మాట్లాడనని అన్నారు. అనంతరం తాప్సీ తల్లిదండ్రులను ఉద్దేశించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

అయితే కంగనా–తాప్సీ మధ్య ఈ వివాదం ఇప్పటిది కాదు. 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలి చందేల్.. తాప్సీని ఉద్దేశించి ‘సస్తీ కాపీ’ (చౌకబారు కాపీ) అనే పదాన్ని ఉపయోగించడంతో తొలిసారి వీరి మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2020లో బాలీవుడ్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో కంగనా.. తాప్సీతో పాటు స్వరా భాస్కర్‌ను ‘బి-గ్రేడ్ నటీమణులు’గా అభివర్ణించడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తాప్సీ చేసిన వ్యాఖ్యలతో పాత వివాదం మరోసారి తెరపైకి రావడం, దానికి కంగనా మరింత ఘాటైన పదజాలంతో స్పందించడం బాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ప్రస్తుతం తాప్సీ నటించిన ప్రతీకార నేపథ్య డ్రామా ‘గాంధారి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో తాప్సీ చేసిన వ్యాఖ్యలు, వాటికి కంగనా ఇచ్చిన కౌంటర్‌తో మరోసారి ఈ ఇద్దరు నటీమణుల మధ్య వివాదం వార్తల్లో నిలిచింది. మరి ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక మరోసారి ఇద్దరి నుంచి కౌంటర్లు వస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement