సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్‌బాబు (హీరో మహేశ్‌బాబు సోదరుడు) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100, మంగళవారం’ చిత్రాల ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.
చలసాని అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ మూవీ జూలై 9న విడుదల కానుంది. ఘట్టమనేని కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న మూడో తరం హీరోగా జయకృష్ణ నిలుస్తున్నారు. కృష్ణ ఆదేశాల మేరకు స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో, ప్రోడక్షన్ విభాగంలో శిక్షణ పొందారు జయకృష్ణ. అదే విధంగా అమెరికా వెళ్లి నటనతో పాటు హీరోకి అవసరమైన అన్నిటిలో పక్కా ట్రైనింగ్ తీసుకున్నారు.
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సిల్వర్ స్క్రీన్‌పై జయకృష్ణ మంచి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారని స్పష్టం చేసింది. అలాగే టీజర్ సినిమాపై మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన జయకృష్ణ లుక్స్, టీజర్‌లోని డైలాగులు, నటన చూస్తుంటే ‘ఒక్కడు’ సినిమాలో మహేశ్‌బాబులా కనబడుతున్నాడని ఘట్టమనేని అభిమానులు అంటున్నారు. తప్పనిసరిగా కృష్ణ, మహేశ్‌బాబుల వారసత్వాన్ని నిలబెట్టే హీరో అవుతాడని, ‘శ్రీనివాస మంగాపురం’తో గ్యారెంటీగా సక్సెస్ అందుకుంటాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.


