పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఓ రకంగా అది మరణ శాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోలీసులను ద్వేషిస్తూ.. రవికి మద్దతుగా లక్షలాది మంది నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్‌హుడ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం వెనక కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు?
చట్టం ప్రకారం రవి( iBomma Ravi) చేసింది నేరం. కొత్త సినిమాను పైరసీ చేయడమే కాకుండా.. హెచ్‌డీ ప్రింట్‌ని సామాన్యులకు ఉచితంగా అందించాడు. అయితే ఇదోదే సంఘ సేవ అయితే కాదు. ఫ్రీగా సినిమా చూపిస్తూనే.. వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని పోలిసులు చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత డేటాని కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే. అయితే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..రెండు బలమైన కారణాల వల్లే రవికి సామాన్యుల మద్దతు లభిస్తుందనే విషయం తెలుస్తోంది.
సామాన్యుడిని దూరం చేశారు!
సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. సామాన్యులు థియేటర్స్‌కి రావాలంటే భయపడిపోతున్నారు. టికెట్ల రేట్లను అంతలా పెంచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. పాప్ కార్న్‌తో పాటు కూల్‌డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉంటుంది. పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టికెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్ షో, ప్రీమియర్ షో అంటూ ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్‌సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది. రూ. 30 ఉండే పాప్ కార్న్‌ని రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.
క్వాలిటీ కంటెంట్..
ఓ వ్యక్తి సినిమాకు వచ్చేదే ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అన్ని మర్చిపోయి హాయిగా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయడానికి థియేటర్స్‌కి వస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి. రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసుకొని..టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. తీరా థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతుంది. నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్‌కి వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చోని ఫోన్‌లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు. రిలీజైన గంటల్లోనే తన ఫోన్‌లోకి సినిమా వచ్చేస్తే.. సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాలిసిందేముంది? ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవిని హీరోగా చేసింది.
సినీ ప్రముఖులు ఏమంటున్నారు?
రవి అరెస్ట్ పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిని రాబిన్ హుడ్ అంటూ పొగడడాన్ని ఆర్జీవీ తప్పుబట్టాడు. టికెట్లు పెరిగాయాని పైరసీ తీసి అందరికి చూపిస్తానంటే.. ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికి ఉచితం ఎందుకు పంచట్లేదు? BMW కార్లను కొట్టేసి మురికి వాడల్లో ఉన్నవాళ్లకి ఇవొచ్చు కదా అని లాజిక్‌తో ప్రశ్నించాడు. అంతేకాదు పైరసీ చేసినవాడిని కాదు పైరసీ చూసిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని సలహా ఇచ్చాడు.
ఇక సినీ నిర్మాత సి. కల్యాణ్ అయితే పైరసీని చేసిన రవికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు.
ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉటుందని, ఇల్లీగల్‌గా ముమ్మాటికే తప్పే అని అని దిల్ రాజు అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్‌సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి. మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే.. సినీ స్టార్స్‌కి మాత్రం విలన్‌గా కనిస్తాడు. కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే.. రేట్ల విషయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.


