గోపీచంద్ హీరోగా నటిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరత వర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వీర జయధీర...’ అంటూ సాగే తొలి పాటను శనివారం విడుదల చేశారు.
‘ఓ వీర... జయధీర.., ఓ వీర... ధ్రువతార.., పయనించే శిఖరం నువ్వేరా... ప్రవహించే సమరం నువ్వేరా.., ఈ పుడమికి కావలి నువ్వురా... ఆ కడలికి కంచెవు నువ్వురా... గగనానికి గొడుగైనావురా... అయినా నువ్వే ఒంటరి...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన పాడారు.
‘‘క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ‘భరత వర్ష’ మూవీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలను పెంచుతూనే ఉంది.
‘వీర జయధీర...’ కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్‌ఫుల్ పాటగా నిలుస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్యసాధన కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మథనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్.


