
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ (Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారిలో బుల్లితెర నటుడు గౌరవ్ ఖన్నా (Gaurav Khanna) ఒకరు! తాజాగా ఓ ఎపిసోడ్‌లో యూట్యూబర్ మృదుల్ తివారీతో తన కుటుంబ విషయాలను చర్చించాడు. నా భార్య పేరు ఆకాంక్ష చమోలా (నటి).. ఈ ఏడాది నవంబర్ నాటికి మా వైవాహిక జీవితానికి 9 ఏళ్లు నిండుతాయి అని చెప్పాడు.
పిల్లలంటే ఇష్టం.. భార్య వద్దంటోంది
ఎంతమంది పిల్లలు అని మృదుల్ అడగ్గా.. ఎవరూ లేరని బదులిచ్చాడు గౌరవ్. నా భార్య పిల్లలు వద్దంటోంది. కానీ, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. మాది ప్రేమ వివాహం. కాబట్టి తనేం చెప్పినా నేను ఒప్పుకుని తీరాల్సిందే! ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటివారి అభిప్రాయాలను మనం గౌరవించాల్సిందే! తను అన్నదాంట్లో కూడా తప్పేం లేదు. ఎందుకంటే మాపై చాలా బాధ్యతలున్నాయి. నేను షూటింగ్స్ కోసం రోజంతా బయటే ఉండాల్సి వస్తుంది. తను కూడా షూటింగ్స్‌తో బిజీగా ఉంటుంది.
ఎవరు చూసుకుంటారు?
అలాంటప్పుడు ఇంట్లో పిల్లలుంటే వారిని ఎవరు చూసుకుంటారు? పిల్లల బాధ్యతను బయటవారికి అప్పజెప్పడం మాకిష్టం లేదు. ఓసారి నాకు పిల్లలు కావాల్సిందేనని తన దగ్గర పట్టుపట్టాను. అప్పుడు నన్ను కూర్చోబెట్టి మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక తను చెప్పింది కూడా కరెక్టే అనిపించి చైల్డ్ ప్లానింగ్ వాయిదా వేసుకున్నాం అని చెప్పుకొచ్చాడు.
దాంపత్యానికి 9 ఏళ్లు
గౌరవ్.. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షోలో పాల్గొని టైటిల్ గెలిచాడు. ఆ షోలోనే ఆకాంక్షతో ఎలా ప్రేమలో పడ్డాడో చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్‌లో ఆమెను తొలిసారి చూడగానే లవ్‌లో పడ్డానని, అలా అతడే ధైర్యం కూడదీసుకుని ఓ అడుగు ముందుకేసి ఆమెతో మాట కలిపానని తెలిపాడు. అలా తమ జర్నీ పెళ్లివరకు వచ్చిందన్నాడు. గౌరవ్- ఆకాంక్ష 2016లో పెళ్లి చేసుకున్నారు.