
బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో (Bigg Boss 9 Agnipariksha)లో 15 మంది మిగిలారు. వీరిమధ్య రకరకాల పోటీలు పెడుతూ ఏరోజుకారోజు ఫలానా కంటెస్టెంట్ బెస్ట్, ఫలానా కంటెస్టెంట్ వరస్ట్ అని ప్రకటిస్తున్నారు. మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకోమని జియోహాట్‌స్టార్‌లో ఓటింగ్ వెసులుబాటు కల్పించారు. నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీజ బెస్ట్ అయితే కల్కిని వరస్ట్ పర్ఫామర్‌గా ప్రకటించారు. మరి ఈ రోజు ఏం జరిగిందనేది నేటి (ఆగస్టు 28) ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం..
లీడర్‌గా దాలియా
ఇప్పటికే నిన్న గేమ్ గెలిచిన ప్రియ.. నేడు కూడా లీడర్‌గానే కొనసాగింది. మరో లీడర్ కోసం టైమ్ గేమ్ ఆడించారు. అందరినీ బాక్సుల్లో కూర్చోబెట్టి సరిగ్గా రెండు నిమిషాల్లో లేవాలన్నారు. అయితే ఫస్ట్, లాస్ట్ లేచినవారు ఆటలో ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చారు. తొమ్మిదో స్థానంలో నిలబడ్డవారికి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. అలా దాలియా గెలిచి లీడర్ అవగా.. షాకిబ్, మనీష్ తొలి, చివరి స్థానాల్లో లేచి ఆటలో లేకుండా పోయారు.

కుండ పగిలింది
ప్రియ, శ్రీజ, పవన్ కల్యాణ్, నిఖిత, నాగ ప్రశాంత్, శ్రేయ ఒక టీమ్‌గా; దాలియా.. ప్రసన్న, శ్వేత, పవన్, అనూష, కల్కి మరో టీమ్‌గా ఏర్పడ్డారు. వీళ్లందరికీ కుండ గేమ్ ఇచ్చారు. వేలితో కుండ కట్టి ఉన్న తాడును పట్టుకోవాలన్నారు. కుండ కింద పడేసినవాళ్లు ఎలిమినేట్ అవడం కాదు కానీ, ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటుందో వారు ఎలిమినేట్ అయినట్లు అని మెలిక పెట్టారు. ఈ గేమ్‌లో ప్రియ టీమ్ నుంచి పవన్ కల్యాణ్, దాలియా టీమ్ నుంచి కల్కి చివరి వరకు ఉన్నారు.
కంటతడి పెట్టుకున్న జవాన్
తన టీమ్ లీడర్ ప్రియ.. కుండ పడేసేయ్ అని చెప్పడంతో పవన్ తనకు సత్తా ఉన్నా సరే, దాన్ని కిందపడేశాడు. తీరా చూస్తే అందులో ప్రియ ఫోటోనే ఉండటంతో వారి టీమ్ ఓడిపోయింది. చివరి వరకు ఉన్న కల్కి కుండలో తన ఫోటోనే ఉంది. అలా తాను గెలవడంతో పాటు తన టీమ్‌ను సైతం గెలిపించింది. అయితే చివరి వరకు వచ్చి ఓడిపోయానని సైనికుడు పవన్ కంటతడి పెట్టుకున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. ఎంత కష్టపడ్డా చివరకు ఇలాగే జరుగుతుందని ఎమోషనల్ అయ్యాడు.

రెండోసారి ఓట్ అప్పీల్
ఈ ఎపిసోడ్‌లో పవన్ కల్యాణ్‌ను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ప్రకటించడంతో అతడు ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. ఈ బంపరాఫర్ ఇతడికి రెండోసారి రావడం విశేషం! అలాగే తన టీమ్‌ను గెలిపించిన కల్కికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిన్న వరస్ట్ ప్లేయర్ అన్నవారితోనే సూపర్ అనేలా గేమ్ ఆడింది. మర్యాద మనీష్‌ను వరస్ట్ ప్లేయర్‌గా ప్రకటించారు.
చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇలా.. లేహ్‌లో చిక్కుకుపోయిన హీరో మాధవన్!