
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనం అల్లాడిపోతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల జనజీవనం స్థంభించిపోయింది. కొన్ని చోట్ల రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల వల్ల తాను జమ్మూ కశ్మీర్‌లో చిక్కుకుపోయానంటున్నాడు తమిళ హీరో ఆర్.మాధవన్ (R Madhavan). ప్రస్తుతం ఇతడు లెహ్‌లో ఉన్నాడు.
17 ఏళ్ల తర్వాత మరోసారి..
తన హోటల్ రూమ్ బయట పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఆగస్టు నెలాఖరుకే లద్దాఖ్‌లో మంచు కురుస్తోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో నేను ఇక్కడే చిక్కుకుపోయాను. అదేంటోకానీ లద్దాఖ్‌కు షూటింగ్‌కు వచ్చిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. 2008 ఆగస్టులో 3 ఇడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను.
అప్పుడు కూడా ఇలాగే..
పాన్‌గాంగ్ సరస్సు వద్ద ఆ మూవీ షూటింగ్ జరిగింది. అప్పుడు కూడా సడన్‌గా మంచు కురవడంతో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడదే పరిస్థితి ఎదురైంది. అయినప్పటికీ ఈ ప్రదేశమంతా ఎంతో అందంగా ఉంది. దాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. కనీసం ఈరోజైనా వాతావరణం కాస్త కుదుటపడితే నేను ఇంటికెళ్లిపోతాను అని చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్‌కు 17 ఏళ్ల తర్వాత వర్షం అన్న క్యాప్షన్‌ను జత చేశాడు. ఆర్ మాధవన్.. చివరగా ఆప్ జైసా కోయ్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ధురంధర్ అనే మూవీ చేస్తున్నాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.