బిగ్‌బాస్ హౌస్‌లోకి యోధులు అంటూ మాజీ కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వీరితో ఆడి గెలిచినవారు కెప్టెన్సీ కంటెండర్ అవుతున్నారు. ఓడినవారు చివరి కెప్టెన్సీ కోసం పోటీపడే అదృష్టాన్ని కోల్పోతున్నారు. మరి తాజాగా హౌస్‌లోకి ఎవరు వచ్చారు? ఎవరు కంటెండర్ అయ్యారనే విషయాలు బుధవారం (నవంబర్ 26వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
ఓడిన తనూజ
బిగ్‌బాస్ హౌస్‌లోకి గత సీజన్ టాప్ 4 కంటెస్టెంట్ ప్రేరణ (Prerana Kambam) అడుగుపెట్టింది. ఆమెను చూడగానే తనూజ.. నువ్వే స్ట్రాంగ్.. నీతో ఆడాలనుందని చెప్పింది. వీళ్లిద్దరూ గేమ్ బాగా ఆడారు. కానీ, తనూజపై సెకన్ వ్యవధిలో ప్రేరణ గెలిచేసింది. ఇక దివ్య, భరణి గొడవలు ఏరోజుకారోజు ఫ్రెష్‌గా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌లో కూడా ఇద్దరూ తగవు పడ్డారు. నా ఏజ్ టాపిక్ తీయకు.. పదిసార్లు ఏజ్ గురించి మాట్లాడితే చిరాకుగా ఉంటుంది.
దివ్యకు క్షమాపణలు
మధ్యలో దూరి మరీ అది చెప్పాల్సిన పని లేదు. దేనికైనా లిమిట్ ఉంటుంది అని అసహనం వ్యక్తం చేశాడు. దానికి దివ్య.. నాకు నొప్పిగా ఉంటే నన్ను చూసి మీరు కుంటినప్పుడు లేదా? నాపై మీరు జోకులేయొచ్చు.. నేను జోకులేస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంటారని దివ్య మండిపడింది. దీంతో భరణి.. నీకో దండం దివ్య అని చెప్పి కాసేపటికి ఆమెకు చేతులు జోడించి మరీ సారీ చెప్పాడు.
మానస్‌పై గెలిచిన పవన్
తర్వాత దేత్తడి హారిక ఇంట్లోకి వచ్చింది. సుమన్‌తో ఆడి గెలిచింది. దీంతో అతడి కెప్టెన్సీ కంటెండర్ చేజారింది. అనంతరం మానస్ రాగా.. అతడు డిమాన్ పవన్‌ను ఎంచుకున్నాడు. వీరిద్దరూ ఆడిన ఆటలో పవన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఈరోజు శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ వంటివారు హౌస్‌లోకి రానున్నారట! ఇకపోతే సుమన్, తనూజ, భరణి తప్ప మిగతా అందరూ కంటెండర్లయినట్లు తెలుస్తోంది.


