‘‘స్క్రిప్ట్ విని, ఈ కథతో సినిమా చేయగలమా? లేదా అనే ఓ జడ్జ్‌మెంట్‌కు రాగలగాలి. సినిమా రిజల్ట్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే సినిమా స్క్రిప్ట్ లెవల్లోనే అన్నీ జాగ్రత్తగా చూసుకోగలగాలి. అఖిల్‌తో మేం చేసిన ‘ఏజెంట్’ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. దాంతో ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అందుకే మంచి స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఆ సినిమా బాగున్నట్లే’’ అని చె΄్పారు నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘నారీ నారీ నడుమ మురారి’ పండగ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి మాజీ ప్రేమికురాలు, ఆ అబ్బాయి ప్రస్తుత లవర్ ఉంటే... ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా సినిమాను మేం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటే చాలా మంది నమ్మలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ మేం ముందుగా చెప్పినట్లే సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘దిల్’ రాజుగారు, వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్‌లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌లో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం.
ఇక సంక్రాంతి సీజన్‌లో నాలుగైదు సినిమాలు రావడం అనేది కామన్. ఈ సీజన్‌లో విడుదలైన సినిమాలన్నీ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మన తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాలూ విడుదలవుతున్నాయి. అయితే కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకాదరణ లభిస్తుంది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ఓటీటీ డీల్ పూర్తయింది. నూతన నటీనటులతో ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీ చేయబోతున్నాం. అడివి శేష్‌తో ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయిదుర్గాతేజ్, తేజ సజ్జాలతో సినిమాలున్నాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘ఏజెంట్’ సినిమా విఫలమైంది. అఖిల్‌కు ఓ హిట్ ఇస్తే ఆ బాధ పోతుంది. ‘భోళా శంకర్’ సినిమాకూ సరైన ఫలితం రాలేదు. ఇదే సినిమా నాలుగేళ్ల క్రితం విడులై ఉంటే, బాక్సాఫీస్ ఫలితం మరోలా ఉండేది’’ అని పేర్కొన్నారు.


