సినీ తారల ప్రేమ, పెళ్లి విషయాలపై పుకార్లు కామన్. వాళ్లు నిజంగా ప్రేమలో ఉన్నా లేకపోయినా సరే.. సోషల్ మీడియాలో అయితే లెక్కలేనన్ని గాసిప్పులు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది తారలు వాటిని లైట్‌గా తీసుకొని స్పందించకుండా ఉంటారు. మరికొంతమంది అయితే క్లారిటీ ఇస్తుంటారు. ఈ రెండో కోవాకు చెందిన హీరోయిన్‌నే మీనాక్షి చౌదరి. ఈ బ్యూటీపై ఇటీవల ఓ రూమర్ గట్టిగా వినిపించింది. అక్కినేని యంగ్ హీరో సుశాంత్‌తో మీనాక్షి(Meenakshi Chaudhary ) ప్రేమలో పడిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మీనాక్షి స్పందించింది. సుశాంత్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘ఇలాంటి పుకార్లు విని నవ్వుకుంటాను. సుశాంత్, నేను మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరం కలిసి నటించాం(మీనాక్షి తొలి సినిమా ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సుశాంత్ హీరో). అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇండస్ట్రీలో అవన్నీ కామన్. రోజుకో గాసిప్ వస్తుంది. అవన్నీ నిజం కాదనీ అందరికీ తెలుసు. నేను కూడా వాటిని మైండ్‌కి తీసుకోను. అలా విని..ఇలా వదిలేస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చెప్పుకొచ్చింది.
మీనాక్షి నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే తన పెళ్లి పుకార్లపై స్పష్టత ఇచ్చింది.


