అప్పుడు ‘నంది’..ఇప్పుడు ‘గద్దర్‌’..రెంటాల అరుదైన ఘనత | Dr Rentala Jayadeva Receiving Gaddar Film Award In Best Film Book On His Mana Cinema First Reel | Sakshi
Sakshi News home page

అప్పుడు ‘నంది’..ఇప్పుడు ‘గద్దర్‌’... సీనియర్‌ జర్నలిస్ట్‌ రెంటాల అరుదైన ఘనత

Jun 15 2025 2:03 PM | Updated on Jun 15 2025 3:29 PM

Dr Rentala Jayadeva Receiving Gaddar Film Award In Best Film Book On His Mana Cinema First Reel

రచయిత, పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్టు, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ ఫిల్మ్ అవార్డు’ను అందుకున్నారు. సినీ రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఉత్తమ తెలుగు చిత్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ప్రారంభించిన గద్దర్ ఫిల్మ్ అవార్డులలో భాగంగా ‘తెలుగు సినిమాపై వచ్చిన ఉత్తమ రచనల’ కేటగిరీలో జయదేవ రాసిన పుస్తకానికి 2024వ సంవత్సరానికి గాను ఈ గౌరవం లభించింది. 

మరుగున పడిపోయిన మన సినీ చరిత్రలోని అనేక అంశాలను తవ్వితీసి, జయదేవ రచించిన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకాన్ని ‘ఉత్తమ సినీ గ్రంథం’గా రాష్ట్ర ప్రభుత్వ జ్యూరీ ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గద్దర్ అవార్డు సిల్వర్ మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని జయదేవకు అందజేశారు. ఈ సందర్భంగా వేదికపై ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం ప్రతిని ఉప ముఖ్యమంత్రి అందుకొని, రచయితను అభినందించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సినిమా అవార్డులు ప్రకటించడం ఇదే తొలిసారి. ఆ తొట్టతొలి అవార్డే రెంటాల జయదేవను వరించడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులుగా పాపులరైన ఈ పురస్కారాల్లో... గతంలో 2011వ సంవత్సరానికి గానూ జయదేవకు ‘ఉత్తమ సినీ విమర్శకుడు’గా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ గౌరవం సైతం అందుకున్నారు. తాజా గద్దర్ అవార్డుతో... అటు నంది, ఇటు గద్దర్... రెండూ సాధించి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పురస్కార విజేత అయిన తొలి జర్నలిస్టు అనే అరుదైన రికార్డు జయదేవకు దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement