బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రాముడి పాత్రను పోషించడానికి సుశాంత్ కంటే సరైన వ్యక్తి మరొకరు లేరని ఆమె అభిప్రాయపడ్డారు.
ఓ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేత మాట్లాడుతూ.. 'రాముడి విలువలను సుశాంత్ ఎంతో అందంగా ప్రతిబింబించాడు. అతడి కళ్లలోని నిర్మలత్వం, చిరునవ్వు, వ్యక్తిత్వం రాముడిని గుర్తు చేసేవి. అందుకే చాలామంది అతడిని రాముడితో పోల్చేవారు' అని చెప్పారు.
సుశాంత్ గురించి తలచుకుంటే ఇప్పటికీ అతడు మన మధ్యే ఉండాలని అనిపిస్తుందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'అన్నయ్యకు పేరు, ప్రతిష్ఠపై ఎప్పుడూ ఆసక్తి ఉండేది కాదు. సమాజానికి మంచి సందేశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన సినిమాలు చేసేవారు. కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ప్రేమగా, రక్షణగా ఉండేవారు' అని తెలిపారు.
ఇటీవల శ్వేత సుశాంత్‌ను రాముడి రూపంలో చూపిస్తూ కృత్రిమ మేధ (ఏఐ)తో రూపొందించిన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాముడు అంటే కేవలం ఒక పాత్ర కాదని, మర్యాద, కరుణ, ధైర్యం, నిజాయితీ వంటి విలువలకు ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి విలువలు సుశాంత్ వ్యక్తిత్వంలో కనిపించేవని ఆమె వివరించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై ఇప్పటికీ అనేక చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.


