సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య జరిగే వార్ కొత్త విషయం కాదు. తమ అభిమాన హీరో గొప్పంటే.. తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు సెటైర్లు, మీమ్స్, ట్రోల్స్‌తో విరుచుకుపడుతుంటారు. అయితే ఈ పోరు హద్దులు దాటినప్పుడు అది కేవలం అభిమానుల మధ్య గొడవగా మిగలకుండా.. హీరోల ఇమేజ్, వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించే స్థాయికి చేరుతోంది. తాజాగా ఓ సీనియర్ హీరోను టార్గెట్ చేస్తూ వచ్చిన మీమ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.
తాజాగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఒకే మీమ్ టెంప్లెట్‌తో హడావిడి నడిచింది. సదరు సీనియర్ హీరోను ట్రోల్ చేసేలా నడిచిందా వ్యవహారం. అయితే దీనిపై వాయు వేగంతో స్పందించిన ఆయన టీం.. ఆ పోస్టులను డిలీట్ చేయిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఇన్‌స్టాగ్రామ్ మీమ్ పేజీలకు నోటీసులు పంపించారు. మరికొన్ని పేజీలను ఏకంగా సస్పెండ్ చేయించారు. దీంతో ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.
‘‘ఎంత అధికారం అండ ఉన్నంత మాత్రాన.. ఇలా కట్టడి చేయడమేంటి?’’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీమ్స్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా అమెచ్యూరిష్ నిర్ణయమంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లినప్పుడు చర్యలు తప్పవని సమర్థిస్తున్నారు.
సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల్లో ఈ పోటీ ‘కులం కార్డు’ తెచ్చి మరీ ఒక్కోసారి తీవ్ర స్థాయికి చేరుతుంది. హీరోలపై ప్రశంసలు, విమర్శలు సాధారణమే అయినా.. కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు వివాదాలకు కారణమవుతున్నాయి.
ఇటీవల ఓ దిగ్గజ నటుడిని లక్ష్యంగా చేసుకుని వరుసగా మీమ్స్ రావడం చర్చనీయాంశమైంది. ఒక దశలో అది కేవలం సరదా ట్రోలింగ్ కాకుండా.. ఓ సినిమా కోసం ప్రణాళికాబద్ధమైన ప్రచారంలా మారిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే అదే వ్యవహారం తిరిగి విమర్శలు చేసిన వారిపైనే ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే సదరు హీరోను టార్గెట్ చేసిన మీమ్స్‌పై ఆయన టీం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు ఇలాంటి చర్యలే పరిష్కారమా? అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు.
‘‘అవతలివారిపై రాళ్లు వేశాక.. తిరిగి మనపై పడుతున్నప్పుడు ‘విక్టిమ్ కార్డ్’ ప్లే చేయడం సరికాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ ఆ హీరోకు, ఆ కాంపౌండ్‌లోని హీరోలకు, వాళ్లను డిఫెండ్ చేస్తున్న అభిమానులకు కొందరు హితవు పలుకుతున్నారు. అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ.. అది వ్యక్తిగత దూషణలు, కక్షల స్థాయికి చేరకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మీమ్స్, ట్రోల్స్ యుగంలో సెలబ్రిటీలను విమర్శించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమే అయినా.. పరిమితులు దాటినప్పుడు వచ్చే పరిణామాలపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.


