భారతీయ తొలి ఐటమ్‌ గాళ్‌ ఓ పాకిస్తానీ.. | Do You Know India First Special Song Dancer Is A Pakistani Actress | Sakshi
Sakshi News home page

ఇండియా ఫస్ట్‌ ఐటమ్‌ గర్ల్‌ ఓ పాకిస్తానీ.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

May 5 2025 11:14 AM | Updated on May 5 2025 11:20 AM

Do You Know India First Special Song Dancer Is A Pakistani Actress

భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్‌ సాంగ్స్‌ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్‌ చిత్రాలు ఐటమ్‌ సాంగ్‌ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్‌ రసిలే’, కరీనా కపూర్‌ ‘ఫేవికోల్‌ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్‌బర్‌ దిల్‌బర్‌’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్‌కీ రాత్‌ ద్వారా ఐటమ్‌ క్వీన్‌గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన  ఈ ఐటమ్‌ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో  తెలుసా?

సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా  ఈ ఐటమ్‌ నంబర్ల ట్రెండ్‌ను హెలెన్, బిందు లేదా జీనత్‌ అమెన్‌ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్‌ ఐటమ్‌ గర్ల్‌ ఎవరో  తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్‌ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.

అన్నా మేరీ గ్వీజెలర్‌...ఉరఫ్‌  మేడమ్‌ అజురీ... బాలీవుడ్‌లో తొలి ఐటమ్‌ డాన్సర్‌ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్‌ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్‌ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్‌ కాగా, తండ్రి జర్మన్‌ జ్యూయిష్‌ డాక్టర్‌. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు.  

అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్‌ సర్కిల్‌లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్‌ సర్కిల్‌ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్‌తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని  నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్‌’, ‘క్వత్ల్‌–ఎ–ఆమ్‌’, ‘ది బాంబే టాకీస్‌’, ‘నయా సంసార్‌’ వంటి చిత్రాలతో సహా  700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్‌ అయ్యింది.

తమ ప్యాలెస్‌లో నృత్యం చేయాలంటూ మేడమ్‌ అజురీకి బ్రిటన్‌ లోని బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది.  దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్‌ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్‌లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్‌బై చెప్పేసింది.  ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్‌ డాన్స్‌ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్‌ డ్యాన్సులకు ఊపిరిపోసిన  అజురీ ఆగస్టు 1998లో మరణించింది.

Advertisement
 
Advertisement
Advertisement