అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారు.. తప్పించుకోడానికి ఏం చేశానంటే: నటి | Dia Mirza Recalls Years Of Sharing Room With Her Hairdresser To Ward Off Unwanted Midnight Knocks On Door | Sakshi
Sakshi News home page

మగవాళ్లు అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారు.. తప్పించుకోడానికి ఏం చేశానంటే... : నటి

Jun 20 2025 4:01 PM | Updated on Jun 20 2025 5:21 PM

Dia Mirza Recalls Years Of Sharing Room With Her Hairdresser To Ward Off Unwanted Midnight Knocks On Door

ఆమె మన హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే. ప్రస్తుతం  బాలీవుడ్‌లో స్థిరపడింది. అందాల కిరీటాన్ని గెలుచుకున్న దియామీర్జా(Dia Mirza) ఇప్పుడు మంచి పేరున్న బాలీవుడ్‌ నటిగా కొనసాగుతోంది. తమిళ సినిమాల్లో ఓ చిన్న పాత్రలో, బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన దియా, 2000లో మిస్‌ ఆసియా పసిఫిక్‌ ఇంటర్నేషనల్‌ కిరీటాన్ని గెలిచిన తరువాత, హిందీ సినిమాల్లో అడుగుపెట్టింది. ఆమె ఆర్‌. మాధవన్‌ సరసన తొలి చిత్రం రెహ్నా హై తెరే దిల్‌ మేన్‌లో నటించింది. ఈ నేపధ్యంలో ఇటీవల  దియా మీర్జా తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడింది. ఒక అవుట్‌సైడర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఎంత కష్టం అనేది  చెప్పిన దియా, ‘ఆ ప్రయాణాన్ని వివరించాలంటే ఓ పుస్తకమే రాయాల్సి వస్తుంది. అది చాలా భయంకరం, కఠినం.‘ అని చెప్పింది.

ఇండస్ట్రీలో పుష్కలంగా అవకాశాలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ, అవి  బలమైన బ్యాగ్రౌండ్‌ ఉన్న వారికే ఇచ్చే పరిస్థితులు ఉండేవని ఆమె చెప్పారు. ‘‘పలు సినిమాలు నాకు ఇవ్వకుండా ఇండస్ట్రీ బ్యాకింగ్‌ ఉన్న నటీమణులకు ఇచ్చారు. అదీ నిజం’’ అన్నారామె. ఇప్పటి సినిమాల్లో మహిళా పాత్రల రాస్తున్న రచయితలు, కథనాలు మెరుగయ్యాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘గతంలో కొన్ని పాత్రలు ఎలా రాసేవారో , అవి ఎంత రెగ్రెసివ్‌గా ఉండేవో, నాకు ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో సీన్‌ చేయడం మీదే దృష్టి ఉండేది. అప్పటి జీర్ణించుకుపోయిన మనస్తత్వం, పురుషాధిపత్యం ఎలా  ఉండేదో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ అవగాహన వల్లే ఇప్పుడు సరైనవి ఎంచుకోగలుగుతున్నాను‘ అని ఆమె పేర్కొంది.

అంతేకాదు..ఒకప్పుడు మగవాళ్లు అర్ధరాత్రుళ్లు తారల రూమ్‌ తలుపులు కొట్టేవారంటూ ఆమె చెప్పకనే చెప్పడం విశేషం. అలా అర్ధరాత్రుళ్లు తలుపులు కొట్టేవారి నుంచి తప్పించుకోవడం  కోసం తన హెయిర్‌డ్రెస్సర్‌తో గదిని పంచుకున్నానని ఆమె గుర్తు చేశారు. ‘చాలా మంది నటీమణులకు అలాంటి సమయంలో తల్లిదండ్రుల మద్దతు ఉండేది. నా వెంట మాత్రం ఎప్పుడూ నా టీమ్‌  హెయిర్‌డ్రెస్సర్, మేకప్‌ ఆర్టిస్ట్, స్పాట్‌బాయ్‌ లు మాత్రమే ఉండేవారు. వాళ్లే నా రక్షక వలయం,‘ అని చెప్పింది.

‘‘ప్రసాద్‌ అన్నా నా స్పాట్‌బాయ్‌గా ఎన్నో సంవత్సరాలు నా వెంట ఉన్నాడు. కోవిడ్‌ సమయంలో ఆయనను కోల్పోయాను. నా హెయిర్‌డ్రెస్సర్‌ 16–17 సంవత్సరాలు నా కోసం పని చేసింది. అలా వారితో కలిసి నేను నా చుట్టూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకున్నాను,’’ అని చెప్పిన దియా వివరించింది. ప్రస్తుతం దియా మీర్జా, నెట్ఫ్లిక్స్‌ చిత్రం నాదానియాన్లో నటించింది. ఈ సినిమాలో ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement