
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా అభిమానులను మెప్పించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.
అయితే తాజాగా ఈ మూవీపై మరో వివాదం మొదలైంది. తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలో మూడు పాటలను ఉపయోగించడంపై నటుడు ధనుశ్ తండ్రి, చిత్రనిర్మాత కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో ఉపయోగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కస్తూరి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన చిత్రాల్లోని మూడు పాటలు - పంజు మిట్థై, ఓథా రూబా థారెన్, తూటువలై ఇలై అరాచి లాంటి పాటలు వినియోగించారని ఆరోపించారు. తన అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్రనిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారని ఆయన విమర్శించారు.
కస్తూరి రాజా మాట్లాడుతూ.. 'ఇళయరాజా, దేవా వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి. కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్‌లను ఉపయోగించడం సమస్య కాదు. కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్య తీసుకుంటా' అని తెలిపారు.
(ఇది చదవండి: ఇళయరాజా నోటీసులు.. రూ.5 కోట్లు డిమాండ్)
ఇళయరాజా రూ.5 కోట్ల డిమాండ్..
కాగా.. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఓథా రూబా థారెన్ పాటను ఉపయోగించారు. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఇళయరాజా తన మూడు పాటలను సినిమాలో అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు. రూ. కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమా నుంచి తన పాటలను తొలగించాలని కోరారు.
మరోవైపు గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించినప్పుడు తాము ఎటువంటి తప్పు చేయలేదని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. మేము సినిమాలో ఉపయోగించిన పాటలకు అవసరమైన అన్ని రకాల అనుమతి తీసుకున్నామని తెలిపారు. అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో చాలా వరకు పాత పాటల్ని.. వింటేజ్ ఫీల్ కోసం ఉపయోగించారు.