రెండు రోజులుగా ఎపిసోడ్స్ చూస్తుంటే బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) నిద్రమత్తులో ఉన్నట్లే కనిపిస్తోంది. ఏదో టాస్కులిచ్చామా? ఆడించామా? అన్నట్లుగా ఉన్నాయి. అంతేకాదు.. అసలైన రెబల్‌ను వదిలేసి ఎక్కువమంది రెబల్ అనుకునేవ్యక్తిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడమైతే మరీ దారుణం. ఇక గురువారం (నవంబర్ 6వ) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలైట్స్‌లో చూసేద్దాం..
గొడవకు సై
పాత రెబల్స్ దివ్య (Divya Nikhita)-సుమన్‌కు ఇచ్చిన పని పూర్తయిందన్నారు. తర్వాత రీతూను కొత్త రెబల్‌గా నియమించి ఒకరితో సీరియస్‌గా గొడవపడమన్నాడు. ఇంకేముంది.. ఇమ్మూతో కయ్యానికి కాలు దువ్వింది. ఈ సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ రేసు నుంచి ఒకర్ని తప్పించే పవర్ రీతూకి వచ్చింది. దాని సాయంతో ఆమె సాయిని తీసేసింది. ఏ గేమ్ పెట్టినా గెలుపు మాత్రం ఆరెంజ్ టీమ్‌దే అన్నట్లుగా ఉంది పరిస్థితి.
గౌరవ్‌కు బ్యాడ్జ్..
మొన్న జరిగిన రెండు టాస్కుల్లో వీరే గెలిచారు. నిన్నటి టాస్కులో ఇమ్మూ, గౌరవ్ ఆడి మరోసారి టీమ్‌ను గెలిపించారు. ఈసారి సేఫ్టీ బ్యాడ్జ్ నాక్కావాలని గౌరవ్ అడిగితే మొదట్లో కుదరదని వాదించారు. కానీ, చివరకు సరేనని ఇచ్చారు. బంధాల వల్లే బయటకు వెళ్లిన భరణి లోపలకు వచ్చాక కూడా పెద్దగా మారలేదు. దీంతో నాగార్జున క్లాస్ పీకడంతో కాస్త బుద్ధి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. తన అభిప్రాయాన్ని కాస్త ధైర్యంగా చెప్తున్నాడు.

నన్ను బెదిరించేవాడే లేడు
రెబల్ ఎవరనుకుంటున్నారు? అన్న చర్చలో సంజనాయే అని అనుమానపడ్డాడు. తను మీకు చెప్పిందా? అని దివ్య అడగ్గా.. చెప్పకపోతే నెక్స్ట్ వెళ్లిపోయేది మీ టికెటే అని కల్యాణ్ రెచ్చగొట్టాడు. అందుకు భరణి.. నేను వెళ్లిపోయినా పర్లేదు, హౌస్‌లో నన్ను బెదిరించేవాడే లేడు. వాడు రెబల్ అయినా.. రెబల్‌కు బాబు అయినా! ఆల్‌రెడీ చచ్చి బతికొచ్చినోడ్ని.. అంటూ డైలాగ్ కొట్టాడు.
సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్
తర్వాత రీతూకు.. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటో కొట్టేయమని మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ రీతూ పూర్తి చేయలేదు. తర్వాత బిగ్‌బాస్ అందర్నీ కూర్చోబెట్టి ఎవరు రెబల్ అనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఎక్కువమంది గౌరవ్ పేరు చెప్పడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే బిగ్‌బాస్ రెబల్స్ దివ్య, సుమన్ శెట్టిని కంటెండర్లుగా ప్రకటించారు.
కొత్త కెప్టెన్ ఎవరంటే?
సంజన, నిఖిల్, గౌరవ్, డిమాన్, సాయి, కల్యాణ్ రేసులో నుంచి ఇదివరకే ఔట్ అయిపోగా తనూజ, భరణి, రీతూ, రాము, ఇమ్మూ మిగిలారు. వీరిలో నలుగురికే ఛాన్స్ అనడంతో రాము తాను తప్పుకుంటానని ముందుకొచ్చాడు. అలా కెప్టెన్సీ కోసం తనూజ, భరణి, రీతూ, ఇమ్మూ, దివ్య, సుమన్ పోటీపడనున్నారు. సోషల్ మీడియా లీక్స్ ప్రకారం ఇమ్మాన్యుయేల్ మళ్లీ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది.


