
ఏమాటకామాట.. ఈ సీజన్‌కు హైప్ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి సంజనా. ఆమె గుడ్డు దొంగతనం చేయకపోయుంటే హౌస్‌మేట్స్ అసలు రూపాలు, ఎమోషన్స్ అంత ఈజీగా బయటపడేవి కావు. నెగెటివ్ అవుతానని తెలిసినప్పటికీ షో కోసం ఏదో ఒకటి చేయాలనుకున్న ఆమె కోరిక, తాపత్రయం మెచ్చుకుని తీరాల్సిందే! కానీ ఒక్కసారి క్లిక్ అయింది కదా అని పదేపదే దొంగతనాలు చేయడమే ఆమె విషయంలో నెగెటివ్‌గా మారుతూ వచ్చింది. అదే ఈరోజు కొంపముంచింది. అసలేం జరిగిందో చూసేద్దాం...
మళ్లీ దొంగతనం.. ఈసారి శ్రీజ తోడు
బిగ్‌బాస్ 9లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె వచ్చీరావడంతోనే హౌస్‌లో ఉన్నవారిని 1 నుంచి 13 ర్యాంకుల్లో నిల్చోబెట్టింది. టాప్ 7లో నుంచే కెప్టెన్సీ కంటెండర్లున్నాడు బిగ్‌బాస్. దీంతో దివ్య.. తనతోపాటు సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజను కంటెండర్లుగా ప్రకటించింది. వీళ్లలో ఇమ్మాన్యుయేల్ గెలిచి మూడో కెప్టెన్ అయ్యాడు. మరోపక్క సంజనా.. కొత్తగా వచ్చిన దివ్య బట్టలు కాజేసి దాచిపెట్టింది. ఇందుకు శ్రీజ కూడా సాయం చేసింది. ఆమె బట్టల్ని కొట్టేయడమనేది చాలామందికి నచ్చలేదు. ఈ దొంగతనమే ఆమెను ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది.

అర్ధరాత్రి సైరన్ మోగించిన బిగ్‌బాస్
ఇక బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)కు సడన్‌గా ఏదో గుర్తొచ్చినవాడిలా అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటిసభ్యులను నిద్రలేపాడు. చక్రవ్యూహంలో మరో అధ్యాయానికి సమయం వచ్చింది.. ఇప్పటివరకు మీకు లభించిన ఫలాల్లో బ్లూ, బ్లాక్ సీడ్స్ ఏం తీసుకొచ్చాయో చూశారు. ఇప్పుడు ఎరుపు రంగు విత్తనాలు పొందినవారి వంతు.. వారికి ఇంట్లో ఒకర్ని బయటకు పంపే అధికారాన్నిస్తున్నా.. దివ్య నేను పంపిన సభ్యురాలు, ఫ్లోరా ఇమ్యూనిటీ గెల్చుకుంది. కాబట్టి వీరిద్దరూ మినహా.. రెడ్ సీడ్ పొందనివారిలో నుంచి ఒకర్ని బయటకు పంపాలన్నాడు.
అందరి నిర్ణయం ఒక్కటే
దీంతో రెడ్ సీడ్ పొందిన భరణి, హరీశ్, కల్యాణ్, పవన్, రాము చర్చలు మొదలుపెట్టారు. ముందుగా హరీశ్.. ఈ షోని దొంగతనాల షో అనిపించుకోవడం నాకిష్టం లేదు. అన్నీ దొంగిలిస్తుంది.. తనది సైకో ఆనందం అంటూ సంజనా (Sanjana Galrani) పేరు చెప్పాడు. దివ్య విషయంలో అలా చేయడం నచ్చలేదని భరణి కూడా వంతపాడాడు. అందరూ ఆమె పేరే నిర్ణయించుకుని చెప్పారు. అప్పుడు సంజనా మాట్లాడుతూ.. ఈరోజు చేసిన దొంగతనంలో నేను ఒంటరిగా లేను.
సంజనా అవుట్.. ఏడ్చేసిన ఇమ్మూ
అలాగే దివ్య నాకు మూడో ర్యాంక్ ఇచ్చింది. నేను స్ట్రాంగ్, కాంపిటీషన్ కాబట్టే కార్నర్ చేసి పంపించేయాలనుకుంటున్నారు. ఎవరినీ నేను హర్ట్ ఏయలేదు. అందరితోనూ స్వీట్‌గానే ఉన్నాను. ఈ షో కోసం నేను 100% కాదు, 500% ఎఫర్ట్స్ ఇచ్చాను అంది. సంజనా వెళ్లిపోతుంటే ఇమ్మాన్యుయేల్ పిల్లాడిలా ఏడ్చేశాడు. కప్పు నువ్వే గెలవాలంటూ సంజనా అతడికి ధైర్యం చెప్పి బయటకు వెళ్లిపోయింది. అటు ఇమ్మూ మాత్రం కన్నీళ్లు ఆపలేదు.
ఒంటరివాడ్ని అయిపోయా!
నెగెటివ్ అయినా పర్లేదు, షో కోసం ఏదో ఒకటి చేస్తా.. నేను తప్పులు చేసేటప్పుడు దగ్గరకు రావొద్దని నన్ను దూరం పెట్టేది. ఇప్పుడు ఒంటరివాడ్ని అయిపోయా! ఆవిడ లేకపోతే హౌస్‌లో మజా ఉండదు. తను రోజూ రాత్రి దుప్పటి కప్పుకుని ఏడ్చేది. రెండువారాలు ఏడుస్తూనే ఉంది. ఏరోజూ బాధను బయటకు చూపించేది కాదు అని ఏడుస్తుంటే సీక్రెట్ రూమ్‌లో ఉన్న సంజనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక భరణి, హరీశ్, రాము కూడా.. తను సీక్రెట్ రూమ్‌లో ఉండొచ్చని బలంగా నమ్మారు.