
పవన్ కల్యాణ్ పడాల.. అగ్నిపరీక్షలో ఇతడిని చూసి విన్నింగ్ మెటీరియల్ అనుకున్నారంతా! ఫోకస్ అంతా ఆటపైనే ఉండేది. ఆలోచనంతా గెలుపుపైనే ఉండేది. ఇలాంటి వ్యక్తి బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే అసలైన మజా ఉంటుంది, అవతలి కంటెస్టెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని భ్రమింపజేశాడు. కానీ, బిగ్‌బాస్‌కు వచ్చీరావడంతోనే తన ఫోకస్, ఆలోచనలన్నీ పక్కనపెట్టేశాడు.
ట్రాక్ తప్పిన పవన్
అసలు లక్ష్యాన్ని గాలికొదిలేసి రీతూ, తనూజలను ఓరచూపులు చూడటం, అమ్మాయిలు ఏడిస్తూ వారిని హత్తుకుని ఓదార్చడం తప్ప ఏమీ చేయట్లేదు. ఇది చూసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ప్రియులకు నీరసమొచ్చేసింది. ఆర్మీ జాబ్‌కు బ్రేక్ తీసుకుని మరీ బిగ్‌బాస్‌కు వచ్చిన పవన్ ట్రాక్ తప్పడం ఒకింత ఆశ్చర్యమనే చెప్పవచ్చు. అయితే పవన్.. పేరెంట్స్ కోసమే బలవంతంగా ఆర్మీకి వెళ్లాడు. ఇష్టం లేకుండా సైన్యంలో చేర్పించారని తల్లిదండ్రులతో ఏడాదిన్నరపాటు మాట్లాడనేలేదు.
ఆర్థిక పరిస్థితి బాగోలేక..
ఈ విషయం గురించి పవన్ (Pawan Kalyan Padala) తండ్రి మాట్లాడుతూ.. నేను, నా భార్య కొన్నేళ్లక్రితం తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాం. చావు అంచులవరకు వెళ్లొచ్చాం. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఆ సమయంలో వాడిని వాళ్ల అత్త దగ్గరకు పంపించాం. అక్కడ నాలుగైదేళ్లున్నాడు. అక్కడినుంచి హాస్టల్‌లో చేర్పించాం. చదువైపోగానే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరను, ఇంటికొచ్చేస్తా.. అన్నాడు. అలాగైతే నా ఇంటికి రావొద్దని చెప్పాను.

బలవంతంగా ఉద్యోగానికి..
ఆరోజు వచ్చేయ్‌రా అనుంటే ఈ పరిస్థితిలో ఉండేవాడా? మా బాబాయ్, అన్నయ్య పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తారు. అలా నా కొడుకుని కూడా అదే రంగంలో చూడాలనుకున్నాను. బలవంతంగా ఆర్మీకి పంపించామని 14 నెలలు మాతో మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కట్ చేసేవాడు. నెల రోజులపాటు సెలవులకు ఇంటికి వచ్చినా సరే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. మాతో కూర్చుని పావుగంటైనా మాట్లాడేవాడు కాదు.. కనీసం మాతో కలిసి భోజనం కూడా చేయడు.
నా డబ్బుతోనే పెళ్లి చేస్తా
నేను తిరగడానికి వచ్చాను, మీతో ఊసులాడటానికి కాదంటాడు. వాడికెలా ఉండాలో తెలీదు. వాడు స్నానం చేయడానికి వెళ్తే కూడా బాత్రూమ్‌లో నేనే నీళ్లు పెట్టేవాడిని. నేను ఒకప్పుడు డ్రైవర్‌ను. ఒంట్లో ఓపిక లేకపోవడం వల్ల కిరాణ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నా. కల్యాణ్ డబ్బు ఇస్తానంటాడు.. కానీ నేను తీసుకోను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే వాడి పెళ్లి చేస్తాను.
అదే భయంగా ఉంది
అగ్నిపరీక్షకు అప్లై చేసిన విషయం చెప్పలేదు. సెలక్ట్ అయ్యాక చెప్పాడు. మా ఇష్టాన్ని తను కాదనలేదు కాబట్టి తన ఇష్టాన్ని మేమూ అంగీకరించాం. బిగ్‌బాస్ షోలో కల్యాణ్ ఆట గురించి ఎవరైనా చెప్తుంటే ఆ క్షణం ఆనందంగా ఉంటుంది, కానీ మనసుకు నచ్చదు. ఆ షో నుంచి వచ్చాక ఉద్యోగానికి వెళ్తాడా? లీవ్ గురించి అక్కడేమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్నదే భయంగా ఉంది అని పవన్ తండ్రి చెప్పుకొచ్చాడు.
చదవండి: హౌస్‌మేట్స్‌ను వెర్రిపప్పలను చేసిన బిగ్‌బాస్.. ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు