
జనాల దృష్టిని ఆకర్షించేందుకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష (Bigg Boss Agnipariksha) అంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. కామన్ మ్యాన్‌గా షోలో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ మీదే అంటూ ఊరించడంతో దాదాపు 20 వేల మంది అప్లై చేసుకున్నారు. దశలవారీగా వారిని ఫిల్టర్ చేసి చివరకు 45 మందిని ఎంపిక చేశారు. వీరికి అగ్నిపరీక్ష అనే కార్యక్రమంలో రకరకాల టాస్కులు పెట్టి అందులో కనీసం ఐదుగురిని బిగ్‌బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)కు సెలక్ట్ చేయనున్నారు.
దివ్యాంగుడి పేరిట రికార్డులు
ఈ షో ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలో దివ్యాంగుడు ప్రసన్నకుమార్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కనిపించారు. అందులో గంగవ్వ వయసులో ఉన్న మహిళ, మాస్క్ మ్యాన్.. ఇలా విభిన్న వ్యక్తులున్నారు. అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన వ్యక్తి ప్రసన్నకుమార్. ఇతడు ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, బైక్ రైడర్, లెక్చరర్ కూడా! మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్
ఇలాంటి వ్యక్తి.. షోలో అడుగుపెడితే చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని అందరూ భావించారు. అతడు కచ్చితంగా బిగ్‌బాస్ 9వ సీజన్‌లో ఉండాల్సిందేనని బలంగా కోరుకున్నారు. కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అతడు ఎలిమినేట్ అయ్యాడట! శ్వేతాశెట్టి అనే అమ్మాయితో పాటు ప్రసన్నకుమార్ ఎలిమినేట్ అయినట్లు ఓ వార్త వైరలవుతోంది. ఇది చూసిన జనాలు నిరాశచెందుతున్నారు. ప్రసన్న కుమార్‌ను కనీసం బిగ్‌బాస్ హౌస్ వరకైనా పంపించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. మరి ప్రసన్న ఎలిమినేషన్ నిజమేనా? అతడు 9వ సీజన్‌లో అడుగుపెడతాడా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
చదవండి: ఇండస్ట్రీలో మా పరిస్థితి చాలా దారుణం: ప్రముఖ సింగర్ ఆవేదన