
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ తర్వాత ఎక్కువగా వినిపించే మాట రెమ్యునరేషన్. హీరోకు ఎన్ని కోట్లు, హీరోయిన్‌కు ఎంత అనే చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఒక్క సినిమాకు డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడున్న మార్కెట్‌లో స్టార్ హీరోలైతే కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్నారు. కొందరు డైరెక్టర్స్ సైతం హీరో రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ మొత్తంలో కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినీ ఇండస్ట్రీలో సింగర్స్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని చెబుతోంది ప్రముఖ గాయని కనికా కపూర్. ఇండియాలో కొంతమంది సింగర్స్‌కు కనీస పారితోషికం కూడా దక్కడం లేదని అన్నారు.
బేబీ డాల్, చిట్టియాన్ కలైయాన్ లాంటి హిట్ సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న ప్రముఖ సింగర్ కనికా కపూర్. ఇండియాలో సింగర్స్ రెమ్యునరేషన్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆమె బాలీవుడ్‌లో సింగర్స్ ఎందుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి మాట్లాడింది. తనకు సరైన పారితోషికం లభించడం లేదని తెలిపింది. నాతో పాటు స్టార్ హోదా గాయకుల పరిస్థితి కూడా ఇదేనన్నారు. సింగర్స్ లైవ్ కన్సర్ట్ ద్వారా మాత్రమే డబ్బులు సంపాదించే అవకాశముందని వెల్లడించారు.
కనికా కపూర్ మాట్లాడుతూ.. " బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్స్‌కు తగిన పారితోషికం లభించదు. నాకు ఓ కాంట్రాక్ట్‌లో కేవలం రూ. 101 చెల్లించారు. అది కూడా ఈ డబ్బులతో మీకు సాయం చేస్తున్నామని నాతో గొప్పగా చెప్పారు. కేవలం నాకే కాదు.. స్టార్ హోదా ఉన్నవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. భారతదేశంలో పెద్ద సింగర్ తన ఐకానిక్ పాటలకు చాలా వరకు డబ్బు పొందుతాడని నేను అనుకోవడం లేదు. సింగర్స్‌కు లైవ్ కన్సర్ట్స్ మాత్రమే డబ్బు సంపాదించే ఏకైక మార్గం. మీరు ప్రదర్శన ఇవ్వగలిగినంత వరకు సంపాదిస్తూనే ఉంటారు. అలాగే మాకు ఏదైనా జరిగితే పెన్షన్ పథకం కూడా లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా.. కనికా కపూర్ 'రాగిణి ఎంఎంఎస్- 2'లోని 'బేబీ డాల్'పాటతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత లవ్లీ 'హ్యాపీ న్యూ ఇయర్', దేశీ లుక్ 'ఏక్ పహేలి లీలా', బీట్ పె బూటీ 'ఎ ఫ్లయింగ్ జాట్' వంటి వరుస హిట్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇటీవల బాలీవుడ్‌లో 'మేరే హస్బెండ్ కి బివి' చిత్రంలోని 'గోరీ హై కలైయాన్' పాటను పాడారు.