యాంకర్ అనసూయ.. ఒకప్పటి హీరోయిన్ రాశికి క్షమాపణ చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు విషయానికొస్తే కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడిన నటుడు శివాజీ.. హీరోయిన్ల వస్త్రధారణపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. తర్వాత అనసూయ ఈ వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెప్పింది. రీసెంట్‌గా ఈ వివాదంలోకి నటి రాశి ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశి.. కొన్నాళ్ల క్రితం ఓ కామెడీ షోలో అనసూయ తనని కించపరిచిందని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అనసూయ.. సారీ చెప్పడంతో పాటు అప్పుడు అసలేం జరిగిందనేది కూడా చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటి వల్లే సదరు షో నుంచి కూడా బయటకు వచ్చేశానని చెప్పింది.
సదరు ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. 'మూడు నాలుగేళ్ల క్రితం నా భర్త ఓ వీడియో చూపించారు. ఆ షో గురించి, జడ్జిల గురించి మీ అందరికీ తెలుసు. ఆ షో నిర్వాహకులు అప్పట్లో నాకు ఫోన్ చేశారు. మీరు 'ప్రేయసి రావే' మూవీ స్కిట్ చేయాలి అని అడిగారు. కొన్ని ఎపిక్స్ మనం ముట్టుకోకూడదు. దానికి కామెడీ స్కిట్ నేను చేయను. జడ్జిగా రమ్మంటే వస్తాను అని చెప్పా. అయినా సరే స్కిట్ చేశారు. దాంట్లోనే రాశి ఫలాలు అనే పదం ఉపయోగించారు. రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? అని ఆ లేడీ యాంకర్ అడిగింది. ఆమె అలా ఎలా అడుగుతుంది? అది నేను మనసులోకి తీసుకోలేదు'
'రాశి ఫలాలు అనడం మామూలే. కానీ రాశిగారి ఫలాలు అనడంలో నేను ఉన్నాను. ఆ యాంకర్ నా గురించి మాట్లాడింది. అక్కడ జడ్జిల్లో ఓ లేడీ కూడా హాహాహా అని నవ్వింది. నేను ఆ స్థానంలో ఉండుంటే.. షో ఆపేసి రాశి గారి ఫలాలు అని ఎందుకు అంటున్నారు? అని అడిగేదాన్ని. కామెడీ చెయ్యొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లిదండ్రులకే హక్కులేదు. దీన్ని లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నాను గానీ అమ్మ వారించడంతో ఆగిపోయాను' అని చెప్పిన రాశి.. యాంకర్ పేరెత్తకుండానే మండిపడింది. తర్వాత సదరు యాంకర్ అనసూయ అని సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్ ద్వారా తేలింది.
ఇప్పుడు రాశి వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ.. 'డియర్ రాశిగారు. మనస్పూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. మూడేళ్ల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. నా క్షమాపణ అంగీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారుతుంటారు. ఆ షోలో డబుల్ మీనింగ్ మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని మార్పు మీరు గమనించొచ్చు'
'ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నాను. మహిళల శరీరాల గురించి కామెంట్ చేసేవారిని ప్రశ్నించే విషయంలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా బలంగా నిలబడ్డాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా' అని అనసూయ తన క్షమాపణ పోస్టులో రాసుకొచ్చింది.
@RaasiActress ma’am 🙏🏻 pic.twitter.com/DZLfUNp6rr
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026


