ఎప్పుడో ఏదో వివాదంతో చర్చనీయాంశమయ్యే సెలబ్రిటీ అనగానే చిన్మయి గుర్తొస్తుంది. స్వతహాగా సింగర్ అయినప్పటికీ ఫెమినిజం విషయమై నెటిజన్లకు ఈమెకు మధ్య మాటల పంచాయతీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యే శివాజీ వ్యాఖ్యలకు కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చింది. అంతకు ముందు ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పడంతోనూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సాంగ్ సమస్యపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు.
తమిళంలో ఆరేళ్ల క్రితం 'ద్రౌపది' అనే మూవీ వచ్చింది. దర్శకుడు మోహన్ జీ తీసిన ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదమైంది. మహిళా సంఘాలు, పలువురు కార్యకర్తలు ఈ చిత్రంపై నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా, మహిళలని కించపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లలో సింగర్ చిన్మయి కూడా ఉంది. అప్పట్లో మోహన్ vs చిన్మయి కౌంటర్స్ వేసుకున్నారు. అక్కడితో అది అయిపోయింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీశారు.
(ఇదీ చదవండి: 'ఖైదీ' పాప ఇప్పుడెలా మారిపోయిందో తెలుసా?)
'ద్రౌపది 2' పేరుతో తీసిన ఈ సినిమాని మరికొద్ది రోజుల్లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇందులోనే చిన్మయి తనకు తెలియకుండానే ఓ పాట పాడింది. దీని గురించి నెల క్రితం చిన్నపాటి వివాదం నడిచింది. కొన్నాళ్ల క్రితం సంగీత దర్శకుడు జిబ్రాన్ అడగడంతో 'ఏమొకే' అనే పాట పాడానని.. అయితే ఏ సినిమా కోసమని అడగలేదని, ఒకవేళ ఈ మూవీ కోసమే అయితే అస్సలు పాడేదాన్ని కాదని అంటూ క్షమాపణ చెప్పింది. దర్శకుడు మోహన్ భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తి వ్యతిరేకం అని ఏకంగా ట్వీట్ చేసింది.
దీంతో ఆగ్రహం తెచ్చుకున్న దర్శకుడు మోహన్ జీ.. చిన్మయి, తన సినిమాకు కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తుందని అప్పట్లో ఆరోపించారు. థియేటర్లలోకి సినిమా మరికొద్ది రోజుల్లో రాబోతున్న క్రమంలో సదరు పాటపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. చిన్మయి బదులు మరో గాయనితో పాడించిన వెర్షన్ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అలా ఈ సమస్య పరిష్కారమైపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారమే థియేటర్లలో 'రాజాసాబ్'.. ఓటీటీల్లోకి 16 సినిమాలు)


