సినీ పాటలకు తన అద్భుతమైన గొంతుతో ప్రాణం పోసిన గాయని వైకోం విజయలక్ష్మి. చూపు లేకపోయినా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా 72వ జాతీయ చలనచిత్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.
అయితే ఈ అవార్డు వెనుక ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని కొంతమందికే తెలుసు. చూపు లేకపోవడం, ఇతరుల నుంచి ఎదురైన అసహనకరమైన ప్రశ్నలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు.. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఎదురైన పలు అనుభవాలు గతంలో పంచుకున్నారు.
సంగీతమే ప్రపంచం
వైకోం విజయలక్ష్మి పుట్టుకతోనే చూపు సమస్య ఉంది. దీంతో ఆమె చూపు అంతంత మాత్రమే. అయినప్పటికీ చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లిదండ్రులు మురళీధరన్, విమల ఆమెను సంగీతంలో ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే కేజే ఏసుదాస్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజాలను వింటూ పెరిగారు. రెండేళ్ల వయసులోనే పాటలు నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె.. క్రమంగా ప్రొఫెషనల్ సింగర్‌గా ఎదిగారు. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె కెరీర్‌లో ‘కాట్టే కాట్టే’ పాట కీలక మలుపుగా నిలిచిందని గతంలో విజయలక్ష్మి తెలిపారు.
‘నన్ను ఎందుకు టెస్ట్ చేస్తారు?’
చూపు కనిపించకపోవడంపై కొందరు అడిగే ప్రశ్నలు తనకు చాలా బాధ కలిగిస్తాయని విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా తనను గుర్తుపట్టగలదా? అని వాయిస్‌తో పరీక్షించడం ఆమెకు నచ్చదట. ఎవరైనా వచ్చి ‘నేను ఎవరో తెలుసా?’ అంటూ తనను పరీక్షించేలా మాట్లాడితే కోపం వస్తుందని ఆమె చెప్పినట్లు ఓ కథనంలో తెలిసింది. ‘చూపు లేదనే కారణంతో తనను ప్రత్యేకంగా చూడటం, సాధారణ విషయాల్లో కూడా తనను పక్కన పెట్టడం బాధ కలిగిస్తుంది. తాను చూడలేననే కారణంతో ఇతరులు నన్ను దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది.’ అని ఆమె తెలిపారు. అయితే శబ్దం, స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ తన కెరీర్‌ను కొనసాగించడం విశేషం.
ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మిక
చూపు కోసం అమెరికాకు కూడా..
తన చూపును తిరిగి పొందేందుకు విజయలక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2019లో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అయితే ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చికిత్స ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తన సమస్య రెటీనాకు సంబంధించినదా? మెదడుకు సంబంధించినదా? అనే విషయంలో వైద్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆమె గతంలో వెల్లడించారు.
భర్తతో విడాకులు
విజయలక్ష్మి వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన మాజీ భర్త తన సంగీతానికి సహకరించలేదని, తాను పాటలు పాడే సమయాలపై కూడా ఆంక్షలు పెట్టేవారట. సంగీతమే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయంలో అలాంటి పరిమితులు ఎదురవడంతో చివరకు ఆ బంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నరట. ముఖ్యంగా ఈ నిర్ణయం తన తల్లిదండ్రులు చెప్పడం వల్ల తీసుకున్నది కాదని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తానే తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.
‘నా నిర్ణయాలు నావే’
తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తనదేనని విజయలక్ష్మి చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తనకు అండగా ఉన్నప్పటికీ.. తన జీవితాన్ని ఎలా కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు జాతీయ అవార్డు రావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగింది. ఈ పాటలోని ‘అడ్డంకులను దాటి ఎదుగు.. ప్రపంచాన్ని జయించు’ అనే భావం తనకు ఎంతో బలాన్నిస్తుందని విజయలక్ష్మి తెలిపారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను దాటి ఇంతదూరం వచ్చానని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..


