breaking news
Vaikom Vijayalakshmi
-
గానమే గుర్తింపు తెచ్చింది.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదగానే..
సినీ పాటలకు తన అద్భుతమైన గొంతుతో ప్రాణం పోసిన గాయని వైకోం విజయలక్ష్మి. చూపు లేకపోయినా సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా 72వ జాతీయ చలనచిత్ర అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఈ అవార్డు వెనుక ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని కొంతమందికే తెలుసు. చూపు లేకపోవడం, ఇతరుల నుంచి ఎదురైన అసహనకరమైన ప్రశ్నలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులు.. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఎదురైన పలు అనుభవాలు గతంలో పంచుకున్నారు.సంగీతమే ప్రపంచంవైకోం విజయలక్ష్మి పుట్టుకతోనే చూపు సమస్య ఉంది. దీంతో ఆమె చూపు అంతంత మాత్రమే. అయినప్పటికీ చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. తల్లిదండ్రులు మురళీధరన్, విమల ఆమెను సంగీతంలో ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచే కేజే ఏసుదాస్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజాలను వింటూ పెరిగారు. రెండేళ్ల వయసులోనే పాటలు నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె.. క్రమంగా ప్రొఫెషనల్ సింగర్‌గా ఎదిగారు. మలయాళంతో పాటు పలు భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె కెరీర్లో ‘కాట్టే కాట్టే’ పాట కీలక మలుపుగా నిలిచిందని గతంలో విజయలక్ష్మి తెలిపారు.‘నన్ను ఎందుకు టెస్ట్ చేస్తారు?’చూపు కనిపించకపోవడంపై కొందరు అడిగే ప్రశ్నలు తనకు చాలా బాధ కలిగిస్తాయని విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యంగా తనను గుర్తుపట్టగలదా? అని వాయిస్‌తో పరీక్షించడం ఆమెకు నచ్చదట. ఎవరైనా వచ్చి ‘నేను ఎవరో తెలుసా?’ అంటూ తనను పరీక్షించేలా మాట్లాడితే కోపం వస్తుందని ఆమె చెప్పినట్లు ఓ కథనంలో తెలిసింది. ‘చూపు లేదనే కారణంతో తనను ప్రత్యేకంగా చూడటం, సాధారణ విషయాల్లో కూడా తనను పక్కన పెట్టడం బాధ కలిగిస్తుంది. తాను చూడలేననే కారణంతో ఇతరులు నన్ను దూరం చేస్తున్నట్లు అనిపిస్తుంది.’ అని ఆమె తెలిపారు. అయితే శబ్దం, స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ తన కెరీర్‌ను కొనసాగించడం విశేషం.ఇదీ చదవండి: పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మికచూపు కోసం అమెరికాకు కూడా..తన చూపును తిరిగి పొందేందుకు విజయలక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2019లో చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అయితే ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా చికిత్స ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. తన సమస్య రెటీనాకు సంబంధించినదా? మెదడుకు సంబంధించినదా? అనే విషయంలో వైద్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆమె గతంలో వెల్లడించారు.భర్తతో విడాకులువిజయలక్ష్మి వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన మాజీ భర్త తన సంగీతానికి సహకరించలేదని, తాను పాటలు పాడే సమయాలపై కూడా ఆంక్షలు పెట్టేవారట. సంగీతమే తన జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయంలో అలాంటి పరిమితులు ఎదురవడంతో చివరకు ఆ బంధం నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నరట. ముఖ్యంగా ఈ నిర్ణయం తన తల్లిదండ్రులు చెప్పడం వల్ల తీసుకున్నది కాదని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తానే తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.‘నా నిర్ణయాలు నావే’తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తనదేనని విజయలక్ష్మి చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తనకు అండగా ఉన్నప్పటికీ.. తన జీవితాన్ని ఎలా కొనసాగించాలనే విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తనకే ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ‘అంగు వాన కొనిలు’ పాటకు జాతీయ అవార్డు రావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మరోసారి మార్మోగింది. ఈ పాటలోని ‘అడ్డంకులను దాటి ఎదుగు.. ప్రపంచాన్ని జయించు’ అనే భావం తనకు ఎంతో బలాన్నిస్తుందని విజయలక్ష్మి తెలిపారు. తన జీవితంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను దాటి ఇంతదూరం వచ్చానని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’.. -
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో గూస్ బంప్స్ మూమెంట్
గుజరాత్లో మంగళవారం జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు, తారలు అవార్డు విజేతల జాబితాలో ఉన్నప్పటికీ కేవలం మూడే మూడు సందర్భాల్లో అవార్డు విజేతలు ముగ్గురికీ సభికులు తమంతట తాముగా గౌరవ సూచకంగా లేచి నిలబడి మరీ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.తరగని మమ్ముట్టి క్రేజ్యాభై సంవత్సరాల సుదీర్ఘ సినీ జీవితంతో వివిధ భాషల సినీ ప్రేమికులను అలరించిన కన్నడ నటుడు అనంత నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తున్న సంగతి వేదికపై నుంచి ప్రస్తావించినప్పుడు ముందు వరుసల్లోని అవార్డు విజేతలతో సహా సభాంగణంలోని అందరూ లేచి నిలబడి, స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు.ఇదీ చదవండి: ఎక్కువ సినిమాలు చేయడం సక్సెస్ కాదు: హీరోయిన్ నిధి అగర్వాల్జాతీయ ఉత్తమ నటుడిగా మలయాళ నటుడు మమ్మూట్టి (చిత్రం - భ్రమయుగం) పేరును ప్రకటించి, వేదికపై ఆహ్వానించినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇప్పటికి కెరీర్లో నాలుగోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుంటున్న మమ్ముట్టిని సినీ ప్రియులు ఎంతగా అభిమానించారంటే, అప్రయత్నంగా అందరూ లేచి నిలబడి, కరతాళ ధ్వనులు చేశారు. జాతీయ స్థాయిలో మమ్మట్టికి ఉన్న ప్రత్యేక ఆకర్షణకు ఇదో ఉదాహరణ.అంధ గాయనికి అసాధారణ గౌరవందేశవ్యాప్తంగా మిగతా ఇద్దరు దిగ్గజాలలాగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ, అరుదైన ఆ గౌరవం అందుకున్న ఆ అవార్డు విజేత వేరెవరో కాదు దృష్టిలోపం ఉన్న అత్యద్భుత మలయాళ గాయని వైకోమ్ విజయలక్ష్మి. ‘ఏ.ఆర్.ఎం.’లో పాడిన ‘అంగు వాన కోనిలు…’ పాటకు గాను ఆమె జాతీయ ఉత్తమ సినీ నేపథ్య గాయనిగా ఎంపికయ్యారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ సినీ పురస్కారాలతో సహా ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న ఈమెకు ఇదే తొలి జాతీయ అవార్డు.ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబికసినిమా కోసం వైకోమ్ విజయలక్ష్మి పాడిన పాటను తెరపై చూపుతూ, కంటిచూపు లోపం ఉన్న ఆమెను సహాయకులు వేదిక మీదకు తీసుకు వస్తుండగా… ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమకు తాము లేచి నిలబడి మరీ, ఆగకుండా నిమిషం పాటు కరతాళ ధ్వనులు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి సైతం ఆ గాయనీమణిని అక్కున చేర్చుకొని, మరీ అవార్డు అందించడం, ప్రత్యేకంగా అభినందనలు చెప్పడంతో సభికుల మనసు ఆర్ద్రమైంది.అతి సామాన్యురాలైనప్పటికీ, చెదరని ఆత్మ విశ్వాసంతో అంగ వైకల్యాన్ని జయించి, ప్రపంచానికి తన సత్తా చాటిన వైకోమ్ విజయలక్ష్మికి గుజరాత్ లాంటి సుదూర ప్రాంతంలో జనమంతా లేచి నిలబడి, అభినందన పూర్వక కరతాళ ధ్వనులు చేయడం అసాధారణ అంశం. - గుజరాత్‌లోని ఏక్తానగర్ నుంచి ఆర్. జయRenowned singer #VaikomVijayalakshmi receives the prestigious #NationalFilmAward for #BestFemalePlaybackSinger from the Hon'ble President of India, Smt. Droupadi Murmu, to a heartfelt standing ovation from the audience at the #72ndNationalFilmAwards ceremony! 🌟@nfdcindia pic.twitter.com/1diDs4Me7Q— PIB in KERALAM (@PIBTvpm) September 22, 2026 -
చీకటిని జయించిన విజయగానం
కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది. మలయాళ చిత్రం ‘ఏ.ఆర్.ఎం’లో పాడిన అద్భుతమైన జోలపాటకు ‘జాతీయ ఉత్తమ గాయని’గా నిలిచిన వైకోమ్ విజయలక్ష్మి ప్రస్థానం అవార్డులకే పరిమితం కాని సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం!‘కె.జె.ఏసుదాస్ గారు ఎక్కడ ఉన్నా నాకు ఫోన్ చేయక మానరు. ఆయనే నాకు ఎన్నో సంగీత మెళకువలు నేర్పిన గురువు’ అంటారు వైకోమ్ విజయలక్ష్మి. ‘చూపు లేని నాకు ఎస్.జానకి, వాణి జయరామ్ వంటి గాయనులే సంగీత సరస్వతులుగా కనిపించారు. వారి పాటలు వినే పాడటం నేర్చుకున్నాను’ అంటారామె.అంధులు గాయనీమణులుగా రాణించడం మనకు తెలిసిందే. కాని జాతీయగాయనిగా అవార్డు పొందడం మాత్రం విజయలక్ష్మికే సాధ్యమైంది. చూపు లేకపోయినా సినీ సంగీతంలో సంగీత దర్శకుడిగా రవీంద్ర జైన్ ఎన్నో విజయాలు సాధించారు. గాయనిగా వైకోమ్ విజయలక్ష్మి ‘ఏ.ఆర్.ఎం’ సినిమాలో ‘అంగు వాన కోనిలు’ అనే గొప్ప పాట పాడి నేషనల్ అవార్డు పొందారు. టివోలి థామస్ ఈ సినిమా హీరో.తోడుగా నిలిచిన తండ్రి... కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో 1981 విజయదశమి నాడు మురళీధరన్, విమల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. పండుగరోజే పుట్టినా ఆ దంపతుల ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పుట్టుకతోనే మెదడు నరాల బలహీనత కారణంగా ఆమెకు చూపు రాదని డాక్టర్లు తేల్చేశారు. ఆ సమయంలో మురళీధరన్ది మద్రాస్‌లో (చెన్నై) ఎలక్ట్రానిక్స్ వ్యాపారం. అయితే ఐదేళ్ల వయసుకే రేడియోలో వచ్చే ఇళయరాజా, ఎం.ఎస్. విశ్వనాథన్‌ల తమిళ పాటలను విని, అచ్చు గుద్దినట్టు హమ్ చేస్తున్న కూతురిని చూసి వ్యాపారాన్ని పక్కనబెట్టి, ఆమెకు సంగీతమే సర్వస్వం చేయాలని నిశ్చయించుకుని సొంత ఊరు వైకోమ్ తిరిగి వచ్చేశారు. గాయత్రి వీణలో మేటి... విజయలక్ష్మికి చూపు లేని కారణంగా పాఠశాల విద్య, సాంప్రదాయ అక్షరాస్యత సాధ్యపడలేదు. కానీ వినికిడి శక్తితో దాదాపు 100కు పైగా రాగాలను గురువు లేకుండా సొంతంగా నేర్చుకుంది. కూతురి ప్రతిభకు ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకున్న అనుభవాన్ని జోడించిన మురళీధరన్ ఒక సాధారణ ‘తంబురా’ వాయిద్యాన్ని ఎలక్ట్రికల్ పద్ధతిలో మోడిఫై చేసి, కేవలం సింగిల్ స్ట్రింగ్ ఉండేలా డిజైన్ చేశారు. దీని శబ్దానికి ముగ్ధుడైన వయోలిన్ విద్వాంసుడు కున్నకుడి వైద్యనాథన్ దీనికి ‘గాయత్రీ వీణ’ అని నామకరణం చేశారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌తో నిరంతరాయంగా 24 గంటల పాటు 67 పాటలు వాయించి విజయలక్ష్మి ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ను సొంతం చేసుకున్నారు.రికార్డింగ్ రూమ్ సవాళ్లు... సంగీత కచేరీలతో గుర్తింపు వచ్చినా సినిమా రంగంలోకి రావడం విజయలక్ష్మికి అంత సులువు కాలేదు. ‘కళ్లు లేని ఈమె రికార్డింగ్ థియేటర్లో మైక్ ముందు ఎలా నిలబడుతుంది?’ అంటూ ఎన్నో ఆడియో స్టూడియోల నుంచి తిరస్కరణలు, అవమానాలు ఎదురయ్యాయి. చివరకు 2013లో మలయాళ దర్శకుడు కమల్ తన ‘సెల్యులాయిడ్’ చిత్రంలో ‘కాట్టే కాట్టే’పాటతో ఆమెకు మొదటి బ్రేక్ ఇచ్చారు. ఆ మొదటి పాటకే ఆమెకు కేరళ స్టేట్ అవార్డ్ దక్కింది. అయితే బ్లైండ్ సింగర్‌గా రికార్డింగ్స్ చేయడం ఒక పెద్ద యుద్ధం. కంపోజర్ ట్యూన్ వినిపిస్తే, దాన్ని క్షణాల్లో మైండ్‌లో రికార్డ్ చేసుకోవాలి. మలయాళం కాకుండా తెలుగు, తమిళం భాషల్లో పాడేటప్పుడు పదాల ఉచ్చారణ మరింత కష్టమయ్యేది. ఒకవైపు హెడ్‌ఫోన్స్ లో మ్యూజిక్ ట్రాక్ రన్ అవుతుంటే, లయ తప్పకుండా, శృతి జారకుండా ఒకే టేక్‌లో పాడటం విజయలక్ష్మి అసాధారణ శైలి.‘పాట కావాలా? పెళ్లి కావాలా?’ శారీరక లోపాలున్న మహిళలను కట్టుబాట్ల పేరుతో అణచివేయాలని చూసే వారికి విజయలక్ష్మి జీవితం ఒక గుణపాఠం. 2016లో ఒక ఎన్నారైతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కాగానే ఆ వ్యక్తి ఆమెపై ఆంక్షలు విధించాడు. ‘నువ్వు స్టేజ్ షోలు ఆపేయాలి, సంగీతానికి దూరంగా ఇంట్లోనే ఉండాలి’ అని కండిషన్ పెట్టాడు. విజయలక్ష్మి వెనక్కి తగ్గలేదు. ‘నా శ్వాస లాంటి సంగీతాన్ని వదులుకుని నేను బతకలేను’ అంటూ ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకుంటున్నట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో అనూప్ అనే సంగీత ప్రియుడిని వివాహం చేసుకున్నప్పటికీ మనస్పర్థల వల్ల 2021లో విడాకులు తీసుకుని ఒంటరిగానే సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.పురుషాధిక్య సమాజపు ఆంక్షలను ధిక్కరించి, ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్న ఆ నిర్ణయమే ఈ రోజు ఆమెను దేశంలోనే అత్యున్నత జాతీయ అవార్డు వేదికపై విజేతగా నిలబెట్టింది. -
పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది
ఒక పాట.. భాషల సరిహద్దులను దాటి కోట్లాది మనసులను తాకుతుంది. ఒక స్వరం... కళ్లతో కాదు, హృదయంతో ప్రపంచాన్ని చూస్తుందని నిరూపిస్తుంది. అలాంటి అరుదైన గాయని వైక్కం విజయలక్ష్మి. 2024 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ మహిళా నేపథ్య గాయని అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు.కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో విజయలక్ష్మి అనంత సుబ్రహ్మణియన్ జన్మించారు. పుట్టుకతోనే తీవ్రమైన దృష్టిలోపంతో జన్మించిన ఆమెకు ఈ ప్రపంచాన్ని కళ్లతో చూసే అదృష్టం లేకపోయినా, సంగీతాన్ని మాత్రం హృదయంతో ఆస్వాదించే వరం లభించింది. చిన్నప్పటి నుంచే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమె, వీణ వాయించడంలోనూ విశేష ప్రతిభ కనబరిచారు. సంగీతమే జీవితంగా భావిస్తూ నిరంతర సాధనతో తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.2013లో విడుదలైన సెల్యులాయిడ్ సినిమాతో నేపథ్య గాయనిగా సినీ రంగంలో అడుగుపెట్టిన వైక్కం విజయలక్ష్మి, తొలి పాటతోనే సంగీత దర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఒరు వడక్కన్ సెల్ఫీ చిత్రంలోని కైక్కొట్టుం కండిట్టిల్లా పాట ఆమెకు అపారమైన గుర్తింపును తీసుకొచ్చింది. అనంతరం ‘తెరి’ చిత్రంలోని ఎన్ జీవనే, కనా చిత్రంలోని వాయాడి పెట్ట పుల్ల వంటి పాటలు దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె స్థానాన్ని మరింత బలపరిచాయి. భావోద్వేగాన్ని స్వరంలో పలికించడంలో ఆమెకు ఉన్న ప్రత్యేక నైపుణ్యమే ప్రతి పాటను శ్రోతల హృదయాలకు చేరువ చేసింది.ఆమె ప్రయాణంలో గుర్తింపులు కూడా తక్కువేం కాదు. ఫిల్మ్‌ఫేర్ పురస్కారం, ఏషియానెట్ పురస్కారం, వనిత పురస్కారం, కేరళ ప్రభుత్వ గౌరవాలు సహా అనేక అవార్డులు ఆమెను వరించాయి. అయితే భారతీయ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర పురస్కారం మాత్రం కాస్త సమయం పట్టింది. ఆ నిరీక్షణకు ముగింపు పలికింది ఏఆర్ఎమ్ చిత్రంలోని అంగు వాన కొనిలు పాట.భావోద్వేగాలతో నిండిన ఈ గీతంలో వైక్కం విజయలక్ష్మి తన గాత్రంతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారు. మలయాళంలో పుట్టిన ఈ పాట భాషల సరిహద్దులను దాటి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సైతం తాకింది. పదాలు అర్థం కాకపోయినా.. ఆమె స్వరంలో వినిపించిన ఆవేదన, మమకారం, ప్రేమ ప్రతి ఒక్కరి మనసును కదిలించాయి. అదే గీతం ఇప్పుడు ఆమెకు జాతీయ ఉత్తమ మహిళా నేపథ్య గాయని పురస్కారాన్ని అందించింది.వైక్కం విజయలక్ష్మి ప్రయాణం ఒక గాయని విజయగాథ మాత్రమే కాదు.. జీవితం మనకు ఏమి ఇవ్వలేదన్నది కాదు, ఉన్న ప్రతిభతో ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే ముఖ్యమని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ. కళ్లలో వెలుగు లేకపోయినా.. తన గాత్రంతో కోట్లాది మంది హృదయాల్లో వెలుగులు నింపిన ఆమె ఇప్పుడు భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె గెలిచింది ఒక అవార్డును మాత్రమే కాదు... కోట్లాది మంది అభిమానుల మనసులను కూడా. -
వైక్కం బయోపిక్‌లో హనన్
తమిళసినిమా: కాదేదీ కవితకు అనర్హం అన్న సామెత మాదిరిగానే ఎవరైనా నటి, నటులు కావచ్చు. అదేవిధంగా సాయం చేయడానికి పేద, గొప్పతో పని లేదు. స్పందించే చిన్న హృదయం చాలు. ఏమిటీ ఏదేదో చెబుతున్నారనుకుంటున్నారా? పై మూడింటికి సంబంధం ఉంది. వైక్కం విజయలక్ష్మి వర్ధమాన గాయని. ఈమె మలయాళ చిత్రం సెల్యులాయిడ్ అనే చిత్రం ద్వారా గాయనిగా పరిచయమై ఆ తరువాత తమిళంలోనూ గాయనిగా రాణిస్తున్నారు. ఇందులో విశేషం ఏముందని అనుకోవచ్చు. వైక్కం విజయలక్ష్మి ఒక అంధురాలు. ఆ కొరతను జయించి గాయనిగా పేరు తెచ్చుకుని చాలా మందికి స్ఫూర్తి గా నిలిచారు. ఇక మరో అంశానికి వస్తే ఇటీవల కేరళలో చేపల విక్రయ వ్యాపారం చేస్తూ కళాశాలలో చదువుకుంటున్న హనన్ అనే యువతి గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. సహ విద్యార్థులు సహా పలువురు హనన్ వృత్తిని అవహేళన చేసినా, వాటిని అసలు కేర్ చేయకుండా తాను చేపల వ్యాపారం చేస్తూనే చదువుకుంటాను అని దృఢమైన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఆమె ఏకంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్నే ఆకర్షించింది. అంతే హనన్ ఆత్మవిశ్వాసాన్ని అభినందించిన ఆయన ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తానని మాట ఇచ్చారు. అలాంటి సమయంలో కేరళ రాష్ట్రం వరద బారిన పడి అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేరళ ముఖ్యమంత్రే వరద బాధితుల సహాయార్థం చేతనైన సాయం చేయాల్సిందిగా అర్ధిస్తుస్న పరిస్థితి. కాగా రోడ్డులో చేపలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ, మరో పక్క చదువుకుంటున్న హనన్ అందరిని ఆశ్చర్య పరుస్తూ రూ.1.5 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించింది. సాయం చేయడానికి మంచి మనసు చాలు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా? ఇక మూడో విషయానికి వస్తే వైక్కం విజయలక్ష్మి బయోపిక్ చిత్రంగా తెరకెక్కినుంది. ఇందులో ఆమె పాత్రలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మత్స్యకారిణి, విద్యార్థిని హనన్ నటించబోతోంది. ఈమె ఇంతకు ముందే అవరై తేడి సెండ్రన్, అరై కల్లన్ ముక్కాల్ కల్లన్, మిఠాయ్ తెరివు అనే చిత్రాల్లో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. -
ఎస్పీబీతో డ్యూయెట్ పాడాలి : గాయని
తమిళసినిమా : సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతంలో విడుదలైన కుక్కూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నేపథ్య గాయని వైకొం విజయలక్ష్మి. ఈమె గళం ఎన్నమో ఏదో చిత్రంలో చోటుచేసుకున్న పుదియ ఉలగై పాట వైకొం విజయలక్ష్మి ఎవరా? అంటూ అభిమానులు వెతికేలా చేసింది. పుట్టుకతోనే అంధురాలైన విజయలక్ష్మి ఇటీవల శస్త్రచికిత్స ద్వారా చూపు పొందింది. ఈమె పాటలు పాడడమే కాకుండా వీణ వాద్య కళాకారిణి కూడా. విజయలక్ష్మి వీణవాద్యంలో ప్రపంచ రికార్డును పొందింది. ఈమె సామర్థ్యాన్ని అభినందిస్తూ అమెరికాకు చెందిన వరల్డ్ తమిళ్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. భగవంతుడి ఆశీర్వాదం వలనే తనకు డాక్టరేట్ లభించిందన్నారు. ఈ డాక్టరేట్‌ను ఆ భగవంతుడికి, గురు, అమ్మా, నాన్న అందరికీ అర్పిస్తున్నట్టు చెప్పారు. తనకు ఇన్ని చిత్రాల్లో పాడే అవకాశం వచ్చినప్పటికీ సంతృప్తిగా లేదన్నారు. ఎస్పీబీతో డ్యూయట్ పాడాలన్నదే తన ఆశ అని విజయలక్ష్మి వెల్లడించారు.


