బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నోటీసులు జారీ చేశారు. ముంబైలోని జుహులో ఉన్న ఆయన బంగ్లాలో జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అజయ్ దేవ్‌గణ్ తన నివాసంలో సెలూన్, స్పా ఏర్పాటు చేస్తున్నట్లు బీఎంసీకి ఫిర్యాదు అందింది. ఇందుకోసం ముందస్తు అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
బంగ్లాను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులు అందిన అనంతరం ఈ విషయంపై వివరణ ఇవ్వాలని అజయ్ దేవ్‌గణ్‌ను కోరినప్పటికీ.. ఆయన నుంచి స్పందన రాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


