టైటిల్: అనగనగా ఒక రాజు
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, తారక్ పొన్నప్ప, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, రంగస్థలం మహేశ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: మారి
సంగీతం: మిక్కీ జె. మేయర్
విడుదల తేది: జనవరి 14, 2026
హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్, యాక్టింగ్తో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘అనగజగా ఒక రాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్) బాగా రిచ్ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్ పొన్నప్ప)తో నవీన్కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Anaganaga Oka Raju Review).
ఎలా ఉందంటే..
తెలిసిన కథతోనే సినిమా తీసి మెప్పించడం అనేది...పాత ఇంటికి కొత్త పెయింట్ వేసినట్టే అవుతుంది. లుక్ మారితే చాలా ఇష్టపబతారు. కానీ లోపాలు కనిపిస్తే విమర్శలు తప్పవు. ‘రాజుగారు’ ఆ విమర్శలు రాకుండా జాగ్రత్త పడ్డారు. కథ- కథనం అంతా పాత చింతకాయ పచ్చడే అయినప్పటికీ.. ‘రాజుగారు’ చేసే హంగామా చూసి ఫుల్ ఎంటర్‌టైన్ అవుతాం. సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఒక్కో సీన్ వచ్చి వెళ్తుంది కానీ.. ఎక్కడా కనెక్ట్ కాలేం. కానీ రాజు గారు పెళ్లి చూపుల వేట మొదలు పెట్టినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఇక ‘ఆపరేషన్ చారులత’ ఎపిసోడ్ నుంచి నవ్వుల యుద్ధం ప్రారంభం అవుతుంది. కథనం ఊహకందేలా సాగినా.. నవీన్ పొలిశెట్టి వేసే పంచ్‌లు, కామెడీ సీన్లతో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. గోవా ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది.
సెకండాఫ్ ప్రారంభంలో కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరో ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత మళ్లీ కథనం పుంజుకుంటుంది. ఎలెక్షన్ క్యాంపెయిన్ ఎపిసోడ్ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో కథనం ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అప్పటివరకు నవ్వించిన రాజుగారు.. చివరిలో కాస్త ఎమోషనల్‌కు గురి చేస్తూ.. ఓ మంచి సందేశం ఇస్తాడు. కథ-కథనం గురించి ఆలోచించకుండా.. వెళ్తే.. ‘అనగనగా ఒకరాజు’ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాడు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా నవీన్ పొలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా మొత్తాన్ని తన భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. రాజు పాత్రలో జీవించేశాడు. ఇక చారులతగా మీనాక్షి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వీరిద్దరు తప్పితే.. మిగతా పాత్రలేవి అంతగా గుర్తుండవు. హీరోయిన్ తండ్రిగా రావు రమేశ్ రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎర్రిబాబు పాత్రలో తారక్ పొన్నప్ప.. బాగానే చేశాడు. కానీ ఆయన పాత్రని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర కామెడీ నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటలు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే. మేయర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనబడుతుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


