సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గతేడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద విన్నర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి మెప్పించింది.
ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ఇసకపట్నం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సిరీస్ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్..ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఐశ్వర్య రాజేశ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.
ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేశ్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ప్రతి సినిమాకు తనకు తానే ఓ గిఫ్ట్ కొంటానని తెలిపింది. అత్యంత ఖరీదైన గిఫ్ట్ తన చేతికి ఉన్న వాచ్ అని పేర్కొంది. అంతేకాదు ఈ వాచ్‌ను సంక్రాంతికి వస్తున్నాం మూవీకి గుర్తుగా రూ.15 లక్షల వాచ్ కొన్నానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఈ వాచ్ బుక్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. ప్రతి మూవీకి ఒక గిఫ్ట్ కొనడం తనకు అలవాటుగా మారిందని ఐశ్వర్య వెల్లడించింది.


