కొన్ని సినిమాలు అందరికీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం అవి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదుర్కొన్నారు. ఈయన లీడ్ రోల్ చేసిన 'బెయిల్' మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా కారణంగా తనకెలాంటి ఫీలింగ్ వచ్చిందో బయటపెట్టారు.
(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో భారీ రెమ్యునరేషన్! రోజుకు రూ.7.5 లక్షలు)
'ఈ మధ్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చూశాను. చూసిన తర్వాత గంటసేపు నిద్రపట్టలేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సీన్స్ చూస్తున్నంతసేపు మా అమ్మనాన్న డాక్టర్ రాజ్ కుమార్, పార్వతమ్మలతో పాటు మా కుటుంబమే గుర్తొచ్చింది. భవిష్యత్‌లో నేను కూడా ఇలాంటి మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చేయాలనుకుంటున్నాను' అని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.
సూర్య హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో మంచి టాక్ వచ్చినప్పటికీ తమిళంలో పెద్దగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీపై సర్వత్రా నెగిటివ్ టాక్ వినిపించింది. అలాంటిది శివరాజ్ కుమార్ కన్నీళ్లు పెట్టుకోవడం, నిద్రపోలేకపోవడం ఆసక్తికరంగా అనిపించింది.
శివరాజ్ కుమార్ విషయానికొస్తే.. కన్నడలో హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ ఈ ఏడాది తెలుగులో వచ్చిన 'పెద్ది'లో కీలక పాత్ర చేశారు. రజనీకాంత్ 'జైలర్ 2'లోనూ అతిథి పాత్ర చేశారు. అలానే తమిళంలోనే 'పికాసో', తెలుగులో 'గుమ్మడి నర్సయ్య', కన్నడలో 'డాడ్', 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రాలతో పాటు క్యాన్సర్ జయించిన తన జీవితం ఆధారంగా తీసిన 'సర్వైవర్: ఏ సూపర్‌స్టార్' డాక్యుమెంటరీలోనూ కనిపించనున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన)


