వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో వెంకటేశ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘కవి సమయం కాదు.. సంగీత సమయం. అందుకే ఎక్కువగా మాట్లాడను’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్.. వెంకటేశ్ తన ఫెవరెట్ హీరో అని తెలిపారు.
ఇదీ చదవండి: ముగ్గురు భామలతో వెంకీ డ్యాన్స్.. 'నారాయణమ్మ' సాంగ్ రిలీజ్
వెంకటేశ్ నా ఫెవరెట్ హీరో..
‘వెంకటేశ్ నా ఫెవరెట్ హీరో. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను పెన్ను పెట్టి రాసిన మొదటి డైలాగ్ ఆయన సినిమాకే. అదే ‘పవిత్ర బంధం’. నా జర్నీ ఆయనతోనే మొదలైంది. అందుకే నేను ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞుడినే. నిజానికి అప్పట్లో నేను ఎవరో ఆయనకు తెలియదు. తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సమయంలో మళ్లీ నన్ను గుర్తు చేసుకున్నారు’ అని త్రివిక్రమ్ చెప్పారు.
అలా తన సినీ ప్రయాణం వెంకటేశ్‌తోనే మొదలైందని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పటికీ వెంకటేశ్ దగ్గర తనకు భయం ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.‘ఎందుకో తెలియదు.. ఆయన దగ్గర నాకు భయం ఉంటుంది. బహుశా గౌరవంతో కూడిన ఇష్టం వల్ల వచ్చిన భయం అయి ఉంటుంది’ అంటూ త్రివిక్రమ్ చెప్పడంతో నవ్వులు పూశాయి.
ఇదీ చదవండి: కేసీఆర్‌ది 4 నిమిషాలే.. థియేటర్‌లో దద్దరిల్లింది.. చూసుకోండి మరి..: కేటీఆర్


