తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!
ఎవరీ అభినయ్?
ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్‌మెన్‌గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు.
చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే?


