ఫస్ట్ స్టెప్ హిట్ స్టెప్ అయితే ఆ ఆనందమే వేరు. 2025లో అలా తొలి అడుగులోనే విజయం సాధించిన దర్శకులు అరడజనుకు పైనే ఉన్నారు. హారర్, కామెడీ, థ్రిల్, ఫ్యామిలీ, లవ్... ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్‌ని ఎంచుకుని, హిట్ అయ్యారు. 2025లో ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ ఆరంభించిన ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.
⇒ మన చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, లేకపోతే ఆ చట్టాలను ఆయుధాలుగా చేసుకుని బలహీనులను కొందరు బలవంతులు ఏ విధంగా ఇబ్బందిపెడతారనే అంశంతో రూపొందిన చిత్రం ‘కోర్ట్’.పోక్సో చట్టం నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన హీరో, హీరోయిన్ హర్‡్ష రోషన్, శ్రీదేవికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. లాయర్‌గా ప్రియదర్శి మంచి మార్కులు కొట్టేశారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలైంది.
⇒ యూత్‌ఫుల్ మూవీస్ ఆడియన్స్‌కు నచ్చాయంటే, కలెక్షన్స్‌కు కొదవే ఉండదు. అందుకు తాజా ఉదాహరణ ‘లిటిల్ హార్ట్స్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో దర్శకుడు సాయి మార్తాండ్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. చదువు పెద్దగా అబ్బని ఓ అబ్బాయి, అమ్మాయి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరి, ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్‌తో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తీశారు సాయి మార్తాండ్. ఈ చిత్రంలో మౌళి తనుజ్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్‌గా నటించారు. ‘90స్’ బయోపిక్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు ఓ నిర్మాత. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదలైంది.
⇒ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా నీరజ కోన పాపులర్ అని తెలిసిందే. ఆమె దర్శకురాలిగా పరి చయం అయిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సరోగసీ అనే సెన్సిబుల్ పాయింట్‌ను, ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్‌స్టోరీని, వారి మానసిక సంఘర్షణను వెండితెరపై బాగా చూపించారు నీరజ. సిద్ధు జొన్నగలడ్డ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీ నిధిశెట్టి హీరోయిన్లుగా టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న విడుదలైంది. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో నీరజ కోన పరిచయమై, హిట్ సాధించడం హర్షించదగ్గ విషయం.
⇒ పెద్ద వ్యాపారవేత్త అయిన కృష్ణకి (సాయికుమార్) అల్లర చిల్లరగా తిరిగే మాస్ కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఎంసెట్‌లో ర్యాంక్ సాధించకపోగా, అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. డొనేషన్ చెల్లించి మరీ కేరళలోని ఓ కాలేజ్‌లో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని చేర్పిస్తాడు తండ్రి. అక్కడ కుమార్, మెర్సీ జాన్ (యుక్తి తరేజా) ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపుతారు. అదే సమయంలో మెర్సీకి ఉన్నపోస్ట్‌ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీఎస్‌టీడీ) వ్యాధి గురించి కుమార్‌కి తెలుస్తుంది. ఆ వ్యాధి పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు జైన్స్ నాని. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 18న విడుదలైంది. ఈ కథను నేర్పుగా డీల్ చేసి,ప్రేక్షకులతో చేత శెభాష్ అనిపించుకున్నారు జైన్స్ నాని.
⇒ 2004లో తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డప్పు మేస్త్రీగా పని చేసే రాజు (అఖిల్ రాజ్), అదే ఊరికి చెందిన ప్రభుత్వ ఆస్పత్రి కాంపౌండర్ వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయి (తేజస్విని) ప్రేమలో పడతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడితోనే తన కూతురి పెళ్లి చేస్తానని తేల్చి చెబుతాడు వెంకన్న. రాజు, రాంబాయిల కథ చివరికి ఏమైంది? అనేది ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రకథ. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు నవంబరు 21న విడుదల చేయగా, సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. సున్నితమైన కథని తన టేకింగ్, మేకింగ్ స్టైల్‌తో సాయిలు కంపాటి అందరి దృష్టినీ ఆకర్షించారు.
⇒ బైరాన్‌పల్లి సంఘటన ఆధారంగా కాల్పనిక కథతో దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘చాంపియన్’. ఈ కథ గురించి చె΄్పాలంటే... రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు బైరాన్‌పల్లి ప్రజలుపోరాటం చేస్తుంటారు. మరోవైపు సికింద్రాబాద్‌లో పుట్టి, పెరిగిన మైఖేల్ సి. విలియమ్స్ (రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్లి, ఆడాలనేది అతని కల. అనుకోని పరిస్థితుల్లో బైరాన్‌పల్లి గ్రామం చేస్తున్నపోరాటంలోకి అడుగుపెడతాడు మైఖేల్. ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న అతని కల నెరవేరిందా? అనేది కథ. మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రోషన్ రీ – ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అతనికి ప్లస్ అయింది. ఈ కథని ప్రదీప్ అద్వైతం భావోద్వేగంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదలైంది.
⇒ వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల ఊరి నేపథ్యంలో 1980 దశకంలో సాగే కథతో ‘శంబాల’ చిత్రాన్ని తెరకెక్కించారు యుగంధర్ ముని. శంబాల ఊరిలో జరిగే అనూహ్యమైన సంఘటనల తాలూకు మిస్టరీని ఛేదించడానికి యువ శాస్త్రవేత్త విక్రమ్ (ఆది) ఆ ఊరికి వెళతాడు. విజ్ఞానం వర్సెస్ శాస్త్రం, దైవ శక్తులు వర్సెస్ మూఢనమ్మకాలు.... వంటి రిస్కీ కథాంశాన్ని ఎన్నుకున్న యుగంధర్ ముని కన్విన్సింగ్‌గా చెప్పడం అభినందనీయం. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేశారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది.
⇒ ‘పెద్దజాతి, చిన్న జాతి అన్న తేడాల్లేవ్... మనందరం ఒక్కటే’ అన్న సందేశాన్ని నినదిస్తూ థియేటర్స్‌లో ‘దండోరా’ వేశారు దర్శకుడు మురళీకాంత్. జీవితంలో తనకు ఎదురైన అనుభవానికి అక్షరరూపం ఇచ్చి.. అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల మధ్య నేటికీ ఉన్న తారతమ్యాలు, కుల వివక్ష, ప్రేమ, పరువు హత్యలు..వంటి అంశాలను మేళవించి ‘దండోరా’ సినిమా తీశారు మురళీకాంత్.
అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి, తను చేసిన తప్పును తాను తెలుసుకుని, పశ్చాత్తాప పడితే, ఆ ఆగ్రవర్ణ కులపెద్దలు అతని మరణం పట్ల ఎలాంటి వివక్ష చూపించారు? అనే పాయింట్‌ను ‘దండోరా’ సినిమాలో చూపించారు. ఇలా తన ప్రతిభను తానే దండోరా వేసుకున్నారు. శివాజీ, నందు, మౌనికా రెడ్డి, నవదీప్, రవికృష్ణ, రాధ్య, బింధు మాధవి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. ము΄్పానేని రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదలైంది.
⇒ పంతంగులపోటీ నేపథ్యంతో రూపొందిన తాజా సినిమా ‘పంతగ్’. ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ఈ సినిమాలోని లీడ్ రోల్స్‌లో నటించారు. యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మూవీగా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాను విజయ్‌కుమార్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్‌లో విడుదలైంది.
⇒ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘రామం రాఘవం’తో ధన్‌రాజ్, రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రంతో భాను భోగవరపు,‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వేకాలనీ’తో నాని కాసరగడ్డ, రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ ‘పాంచ్ మినార్’తో రామ్ కడుమల, కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘దిల్ రుబా’తో విశ్వకరుణ్, ప్రియదర్శి ‘ప్రేమంటే..?’తో నవనీత్ శ్రీరామ్ వంటి నూతన దర్శకులు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.


