నటి దీప్‌శిఖ 'మార్క్ మూవీ'తో కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ నేడు (డిసెంబర్ 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకుంది. ఇది దీప్‌శిఖ సినీ ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. అరంగేట్రానికి ముందే సోషల్ మీడియాలో తన పేరు మారుమోగిపోతోంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్‌లో దీప్‌శిఖ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఆత్మవిశ్వాసంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా..
దీంతో అభిమానులు ఆమెకు “మార్క్ క్వీన్” అనే బిరుదును ఇచ్చారు. ఇక దీప్‌శిఖ మాట్లాడుతూ.. కిచ్చా సుదీప్‌తో కలిసి పనిచేయడం వల్ల నా కల నెరవేరింది. ఆయన దగ్గరి నుంచి క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం నేర్చుకున్నాను. ఇవి నా నటనను మరింత మెరుగుపర్చేందుకు ప్రోత్సహించాయి. అలాగే ప్రతిష్టాత్మక సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌లో పనిచేసినందుకు సంతోషంగా ఉంది.
ఎంతో ప్రేమ
ఇలాంటి గొప్ప నిర్మాణ సంస్థతోనే నా కన్నడ ప్రయాణం ప్రారంభం కావడం నా కెరీర్‌కు మరింత విలువ, ధైర్యాన్ని ఇచ్చింది. ఈ అవకాశం లభించడం నా అదృష్టం. సినిమా విడుదలకంటే ముందే నాపై ఎంతో ప్రేమ చూపించారు. మీ ప్రేమే నన్ను మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది అని పేర్కొంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, సిబ్బంది, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.


