సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.
గతంలో తప్పులు
తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్‌ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.
అలాంటి పాత్రలు చేయాలనుంది
ఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి!


