‘‘ఈషా’ చిత్రానికి హైదరాబాద్‌లో 26 ప్రీమియర్స్ వేస్తే హౌస్‌ఫుల్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బాగుంది. వసూళ్లు బాగున్నాయి. అయితే మా సినిమాని కొందరు టార్గెట్ చేసి, పెయిడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా మీద ఇలా జరగడం దారుణం. ఎవరు ఎన్ని చేసినా మా సినిమా విజయాన్ని అడ్డుకోలేరు’’ అని వంశీ నందిపాటి పేర్కొన్నారు.
త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ–‘‘పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న మా సినిమాని కావాలని బ్యాడ్ చేయడం మంచిది కాదు. నా మూవీని డ్యామేజ్ చేసిన ఎవర్నీ వదలను’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి సినిమాను బ్యాడ్ చేస్తున్నారు’’ అన్నారు బన్నీ వాసు. నిర్మాత హేమ వెంకటేశ్వరరావు మాట్లాడారు.


