కూటికోసం కోటి తిప్పలు. కొందరు సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలోకి రాకముందు ఇతరత్రా పనులు చేసినవారే! మలయాళ నటుడు అజీస్ నెదుమంగడ్ కూడా ఒకప్పుడు డ్రైఫ్రూట్ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. అది కూడా భారత్‌లో కాదు, బహ్రెయిన్‌లో! ఇటీవల బహ్రెయిన్ వెళ్లిన అజీస్ తను పనిచేసిన షాపును గుర్తుపెట్టుకుని మరీ అక్కడకు వెళ్లాడు.
18 ఏళ్ల కిందట..
తనతో పాటు పనిచేసిన స్నేహితుడిని అదే షాపులో కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ ఒకరి బాగోగులను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల కిందట అదే షాపులో పనిచేసిన అజీస్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.
కెరీర్
అజీస్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే! దీంతో అతడు ఇంజనీరింగ్ పట్టా చేతికి రాగానే గల్ఫ్ దేశానికి వలస వెళ్లి షాపులో పనిచేశాడు. కానీ, అక్కడ ఎక్కువకాలం ఉండలేక మళ్లీ స్వదేశానికి తిరిగొచ్చాడు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. పలు స్టేజీలపై మిమిక్రీ చేస్తూ కామెడీ పండించేవాడు. తర్వాత టీవీ షోలలోనూ పాల్గొనడంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు లభించింది.
ప్రాధాన్యమున్న పాత్రలు
అలా 'కుంజలియన్' సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. అది చిన్న అవకాశం. తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు, కానీ పెద్దగా చెప్పుకునే పాత్రలైతే కాదు. చేస్తే మంచి క్యారెక్టర్సే చేయాలి... జూనియర్ ఆర్టిస్ట్‌గా కాదని తీర్మానించుకున్నాడు. అలా యాక్షన్ హీరో బిజు మూవీతో క్లిక్ అయ్యాడు. వాళా, మిన్నాల్ మురళి, కన్నూర్ స్క్వాడ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, జయజయజయహే వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యాడు. దాదాపు 30కి పైగా సినిమాలు చేశాడు.
దాడిలో తీవ్రగాయాలు
అయితే అజీస్ (Azees Nedumangad) జీవితంలో ఓ చేదు ఘటన జరిగింది. 2017 ఏప్రిల్‌లో ఓ స్టేజీ షోకు ఆలస్యంగా వెళ్లాడు అజీస్. అంతే.. అక్కడున్న కొంతమంది ఆగ్రహంతో నటుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో అజీస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఏకంగా 70% వినికిడి శక్తిని కోల్పోవడం బాధాకరం! అవమానాలను సైతం దాటుకుని నేడు మలయాళ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు అజీస్. ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ నటుడిగా కొనసాగుతున్నాడు.


