టాలీవుడ్‌ హారర్ థ్రిల్లర్‌.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే? | tollywood movie AmaravathiKi Ahvanam review In telugu | Sakshi
Sakshi News home page

AmaravathiKi Ahvanam Movie Review: టాలీవుడ్‌ హారర్ థ్రిల్లర్‌.. అమరావతికి ఆహ్వానం ఎలా ఉందంటే?

Feb 13 2026 7:03 PM | Updated on Feb 13 2026 7:28 PM

tollywood movie AmaravathiKi Ahvanam review In telugu

టైటిల్: అమరావతికి ఆహ్వానం

నటీనటులు:  శివ కంఠంనేని, ఎస్తేర్‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులు

ద‌ర్శ‌క‌త్వం: జీవీకే

నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌

నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు

సినిమాటోగ్రఫీ: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి

సంగీతం: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌

ఎడిటింగ్‌: సాయిబాబు తలారి

విడుదల తేదీ: 13 ఫిబ్రవరి, 2026


టాలీవుడ్‌లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.  మంచి కంటెంట్‌ ఉన్న హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. అందుకే మలయాళ థ్రిల్లర్‌ తెగ చూసేస్తున్నారు. అందుకే డైరెక్ట్‌గా తెలుగులోనే వచ్చిన హారర్‌ థ్రిల్లర్‌ అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రం ఫిబ్రవరి 13వ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ టాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.


అమరావతికి ఆహ్వానం కథేంటంటే..

ఈశ్వర్‌ (శివ కంఠమనేని) ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి సిస్టర్స్‌ భార్గవి (సుప్రిత), విజ్జు. అయితే భార్గవికి పెద్ద సెలబ్రిటీ కావాలనే కోరిక ఉంటుంది. అందుకే ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్‌ చేస్తుంటుంది. ఈ యూట్యూబ్‌ ఛానెల్‌లో దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు షూట్‌ చేసి.. కంటెంట్ అప్‌లోడ్‌ చేస్తుంటుంది. అలా  పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెల‌బ్రిటీ అయిపోతుంది.

అయితే సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని అదే విష‌యాన్ని లైవ్‌లో నిరూపిస్తానని..  ఈ వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని భార్గవికి చెప్తాడు. దీంతో మరింత ఉత్సాహంతో భార్గవి కుటుంబంతో సహా  అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడికెళ్లి ఈశ్వర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి? అమరావతిలోని జమీందారు వంశ వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్‌)ను చంపింది ఎవరు? రాజేశ్వరి కుటుంబానికి, ఈశ్వర్‌ కుటుంబానికి మధ్య ఉన్న లింక్‌ ఏంటి?  సీఐగా ఈశ్వర్‌ సస్సెండ్‌ కావడానికి కారణం ఎవరు? అన్న విషయాలు తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే.

ఎలా ఉందంటే..

దెయ్యాలు అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ దెయ్యం నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా మెజారిటీ హారర్‌ సినిమాల్లో దెయ్యాలు, క్షుద్రపూజలనే ప్రధాన కథాంశంగా చూపిస్తారు. ఈ అమరావతికి ఆహ్వానంలోనూ అదే పంథా ఫాలో అయ్యాడు డైరెక్టర్. కాకపోతే ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్‌ చూపించాడు. అంతేకాకుండా మంచి సందేశాన్ని ఇచ్చిన తీరు ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా ఉంది ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా.

అమరావతి అనే గ్రామంలో రాత్రివేళ జరిగే ఓ హారర్‌ సీన్‌తో కథ ప్రారంభించాడు. ఆ తర్వాత వెంటవెంటనే కథను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ చేశాడు. ఫస్‌ హాఫ్‌లో భార్గవి వీడియోలు షూట్‌ చేయడం, మహేశ్ (శివ హ‌రీశ్‌)తో ప్రేమలో పడడం లాంటివి చకచకా జరిగిపోతాయి. ప్రథమార్థంలో అంతగా ఆడియన్స్‌ను భయపెట్టే సీన్స్‌ పెద్దగా కనిపించవు. ఈశ్వర్‌‌ ఫ్యామిలీ అమరావతికి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ రాజేశ్వరి గురించి అసలు నిజం తెలుసుకోవడంతో ఫస్ట్ హాఫ్‌కు ఎండ్‌ కార్డ్ పడుతుంది. ఇక్కడే డైరెక్టర్‌ ఇచ్చిన ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేసింది.

సెకండాఫ్‌లో కథ అంతా రాజేశ్వరి క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఆమె ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌తో కథనం ఆడియన్స్‌కు ఆసక్తికరంగా ‍అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హారర్ సీన్స్‌ ప్రేక్షకులను భయపెట్టేస్తాయి. ఇక ప్రీ క్లైమా క్స్‌ వ‌చ్చే ట్విస్ట్‌  థ్రిల్‌ చేస్తుంది. హారర్‌ ఎలిమెంట్స్‌ మెప్పించినప్పటికీ.. కొన్నిచోట్ల ప్రేక్షకులు ఊహకందేలా సీన్స్ ఉండడం పెద్ద మైనస్. హారర్‌ థ్రిల్లర్‌లో సాంగ్స్‌ ఉంటే కథ సెట్ అవ్వదు.  సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో  సాంగ్ చేయడం అంతగా సెట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే ఓ హారర్‌ థ్రిల్లర్‌ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాడు డైరెక్టర్‌ జీవీకే. తన కథకు తగినట్లుగానే ‌ క్లైమాక్స్‌  డిజైన్ చేయడంలో ద‌ర్శ‌కుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. హారర్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్, థ్రిల్‌ అందించడంలో జీవీకే మార్క్ కనిపించింది. హారర్ కంటెంట్ మూవీస్ ఇష్టపడేవాళ్లు అమరావతికి ఆహ్వానం ట్రై చేయొచ్చు.   క్లైమాక్స్‌లో అమరావతికి ఆహ్వానంకు సీక్వెల్‌ ఉంటుందని ప్ర‌క‌టించారు.

ఎవరెలా చేశారంటే..

ఈశ్వర్‌, జ‌గ‌దీష్‌ పాత్రల‌లో శివ కంఠంనేనిగారి నటన అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లోనూ తనదైన మార్క్ చూపించారు. ఈ సినిమాకు మరో మెయిన్‌ పిల్లర్‌ ఏస్తేర్‌. ఆమె రాజేశ్వరి పాత్రలో అదరగొట్టేశారు. భానుమతి పాత్రలో ధన్యబాలకృష్ణ మెప్పించింది. హారర్‌ సీన్స్‌లో ధన్య అదరగొట్టేసింది. భార్గవి పాత్రను సుప్రిత చాలా బాగా చేసింది. మహేశ్‌, జెమినీ సురేష్, భద్రమ్, అశోక్‌ కుమార్, నాగేంద్రలు వారి వారి పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పద్మనాభ్‌ భరద్వాజ్‌ బీజీఎం హార‌ర్ కథకు బాగా సెట్ అయింది. సాయి బాబా త‌లారి తన ఎడిటింగ్‌కు ఇంకాస్తా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement