‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేం ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)’.రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథంతా హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్న నలుగురు అమ్మాయిలు రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మిల చుట్టూ తిరుగుతుంది. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులలతో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక ఫారిన్ ట్రిప్ వేయాలని స్నేహితులంతా అనుకుంటారు. క్క స్రవంతి సహాయంతో మలేషియా ట్రిప్‌కి ప్లాన్ వేస్తారు. అదే సమయంలో అనకొండ అనే పేరుమోసిన టెర్రరిస్ట్ మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే..
సరదాగా సాగిపోయే ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్లడం.. అనుకోని సమస్యలు రావడం..చివరకు ఓ సందేశం ఇవ్వడం.. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. బ్యాడ్ గాళ్స్ స్టోరీ కూడా అలానే సాగుతుంది. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్‌కు తగ్గట్టే ఉంటాయి.అయితే కథనం నెమ్మదిగా సాగడం.. పలు సినిమాల్లో చూసిన సన్నివేశాలే ఇందులో రిపీట్ కావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.
ఇక సెకండాఫ్‌లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్‌ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్‌ప్లే, కామెడీ పంచ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే..
నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై చక్కగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం , నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.5/5


