కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని కృష్ణాపూర్ పాఠశాలలో తరగతి గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాఠశాలల బయట చెట్ల కింద, వరండాలో ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువులు చెబుతున్నారు. ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 10 మాత్రమే గదులు ఉండగా, కంప్యూటర్, ల్యాబ్, హెచ్‌ఎం కార్యాలయలు ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఎంపీపీఎస్‌లో 186 మంది, జెడ్పీహెచ్‌ఎస్‌లో 120 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో సరిపడా గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడితే పాఠశాలల అవరణలో నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదనపు తరగతి గదులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని ఎంఈఓ సురేష్ తెలిపారు.


