పునర్విభజనలో అల్లాదుర్గంలో 2016లో ప్రభుత్వం ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలను కలుపుకుని ఈ కార్యాలయం ఏర్పాటైంది. ఇందులో 230 అంగన్‌వాడీ కేంద్రాలకు 9 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సెక్టార్‌కు ఒక సూపర్‌వైజర్‌ను నియమించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 5 మంది సూపర్‌వైజర్‌లు మాత్రమే ఉన్నారు. 230 అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం వీరికి ఇబ్బందిగా మారుతోంది. గ్రేడ్1 –2 పోస్టులు, గ్రేడ్ 2 –1 పోస్టు ఖాళీగా ఉన్నాయి. మరో సూపర్‌వైజర్ కరీంనగర్ జిల్లా చొప్పదండికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆమె స్థానంలో ఇక్కడికి ఎవరినీ డిప్యూటేషన్ వేయలేదు.
అక్రమ డిప్యూటేషన్లు
అల్లాదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సిబ్బంది కొరతతో అస్తవ్యస్తంగా మారితే, మరోవైపు అక్రమ డిప్యూటేషన్లు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. అల్లాదుర్గం సీడీపీఓగా లిఖిత, ఏసీడీపీఓగా సాధియాను ప్రభుత్వం నియమించింది. వీరు తమ పలుకుబడితో ఏళ్ల తరబడి హైదరాబాద్ డైరెక్టరేట్‌లో అక్రమంగా డిప్యూటేషన్ వేసుకుని అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. అల్లాదుర్గం సీడీపీఓగా మరొకరికి ఇక్కడికి డిప్యూటేషన్ వేశారు. ఏసీడీపీఓ డిప్యూటేషన్‌పై వెళ్లినా ఎవరినీ ఇక్కడ నియమించలేదు. కార్యాలయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పదేళ్లుగా మంజూరు చేయలేదు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. పదేళ్లుగా ఈ పోస్టుకు డిప్యూటేషన్‌పైనే విధులు నిర్వహించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న వ్యక్తి బదిలీకావడంతో ఈ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో ప్రతీ నెల నివేదికలు జిల్లా అధికారులు సమర్పించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కార్యాలయం నాలుగు భవనాలకు మార్పు
ఐసీడీఎస్ కార్యాలయం నిర్వహణ అధికారులకు ఇబ్బందిగా మారింది. కొన్నేళ్లు ఎంపీపీ కార్యాలయంలో మరి కొన్నేళ్లు అద్దె భవనంలో, ప్రస్తుతం మహిళ మండలి భవనంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు భవనాల్లో కార్యాలయం మార్చారు. సొంత భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రాజెక్టు సమావేశం జరిపేందుకు అధికారులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. అల్లాదుర్గంలో ఐసీడీఎస్ కార్యాలయానికి సొంత భవనం నిర్మాణానికి నెల రోజుల్లో శంకుస్థాపన చేస్తానని మంత్రి మే 9న అల్లాదుర్గంలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. మంత్రి హామీ ఇచ్చి మూడు నెలలు గడిచిన శంకుస్థాపన లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఐసీడీఎస్ కార్యాలయ భవనంతోపాటు సిబ్బందిని నియమించాలని, అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పదేళ్లుగా మంజూరు కాని పోస్టులు
ఉన్నవారికి డిప్యూటేషన్
ఇదేం పాలనో అంటున్న ప్రజలు
పునర్విభజనలో పదేళ్ల క్రితం ఐసీడీఎస్ కార్యాలయం మంజూరైంది. కార్యాలయం మంజూరైనా అందుకవసరమైన సిబ్బందిని మాత్రం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. మరోవైపు ఉన్న సిబ్బందిని మరో చోటుకు డిప్యూటేషన్లు వేయడం, మరో చోటు నుంచి ఇక్కడికి డిప్యూటేషన్లు వేసి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందికి లేక అస్తవ్యస్తంగా మారింది. మొత్తంగా ఇదీ అల్లాదుర్గం ఐసీడీఎస్ కార్యాలయం దుస్థితి.
అల్లాదుర్గం(మెదక్):


