కౌడిపల్లి(నర్సాపూర్): ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవాదాయశాఖ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌స్పెక్టర్, ఆలయ ఇన్‌చార్జి ఈఓ రంగారావ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శివ్వప్ప, రాజేశ్ నల్లపోచమ్మదేవికి పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి ఒడిబియ్యం కుంకుమార్చన ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వాహనాలు పూజలు చేయించారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.


