శివంపేట (నర్సాపూర్): మండల పరిధిలోని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామైన గోమారంలో బోనాల ఉత్సవాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఎస్సై మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అదనపు పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీ, ప్రభుత్వ కార్మిక, కర్షక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు సోమవారం దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ నర్సింహారెడ్డి తెలిపారు. పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ..మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించి స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ఉధృతం చేశారన్నారు. అదే స్ఫూర్తితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 10న జైల్ భరో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ తోషిబా కార్మిక సంఘం నాయకుడు సుధాకర్‌రాజు, ఏషియన్ పెయింట్స్ హమాలీ కార్మిక సంఘం కార్యదర్శి రతన్‌సింగ్, వినోద్‌నాయక్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్షిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి
నారాయణఖేడ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి పేర్కొన్నారు. ఖేడ్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్ రద్దును పూర్తిగా మర్చిపోయారన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి డీఏ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. ప్రీ ప్రైమరీ బడుల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర సేవ కో– కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా, డివిజన్ బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్, రతన్‌సింగ్, మశ్చందర్, మహేశ్, పద్మనాభం, రాజు, జగదీశ్వర్ పాల్గొన్నారు.
పాడిపంటలతో సంతోషంగా ఉండాలి
శివ్వంపేట(నర్సాపూర్): వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.


