అభ్యర్థులూ.. అలర్ట్‌! ప్రచారానికి ఎన్నికల సంఘం నిబంధనలు.. | Sakshi
Sakshi News home page

అభ్యర్థులూ.. అలర్ట్‌! ప్రచారానికి ఎన్నికల సంఘం నిబంధనలు..

Published Mon, Nov 6 2023 1:20 AM

- - Sakshi

సాక్షి, వరంగల్/మహబూబాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తస్మాత్‌ జాగ్రత్త. నిబంధనల మేరకే ప్రచారం నిర్వహించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీని ప్రకారం నాయకులు, కార్యకర్తలు ఉదయం 6 గంటల తర్వాతే ప్రచారం ప్రారంభించాలి. రాత్రి 10 గంటల కల్లా ముగించాలి. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత బహిరంగ సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చీరలు, చొక్కాలు, ఇతర దుస్తులు, క్రీడా పరికరాలు తదితర వస్తువులు పంపిణీ చేస్తే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు భావిస్తారు.

టోపీలు, కండువాలు మాత్రం ఇవ్వొచ్చు. కానీ వాటి ఖర్చును అభ్యర్థి ఎన్నికల పద్దులో రాయాల్సి ఉంటుంది. ప్రచారం చేసే అభ్యర్థి ఎన్ని వాహనాలనైనా ఉపయోగించుకునే వీలుంది. కానీ ముందస్తు రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతి పొందాలి. అనుమతి పత్రం స్పష్టంగా కనిపించేలా వాహనానికి అంటించాలి. పర్మిట్‌ మీద వాహన నంబర్‌, అభ్యర్థి వివరాలు ఉండాలి. ఓ అభ్యర్థి పేరిట పొందిన పత్రాన్ని మరో అభ్యర్థి ప్రచారానికి వినియోగిస్తే చర్యలు తీసుకుంటారు. కరపత్రాలు ముద్రించే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రింటింగ్‌ ప్రెస్‌ చిరునామా ప్రచురించాలి.

బహిరంగ సభల సందర్భంగా..
బహిరంగ సభ ఏర్పాటు చేసే ప్రదేశం, తేదీ, సమయం ముందుగా పోలీసు అధికారులకు తెలిపి, రాత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలా అయితే పోలీసులే ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ ఏర్పాట్లు పరిశీలించే అవకాశం ఉంటుంది. సభ ఏర్పాటు చేసే ప్రదేశం.. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయాలకు సంబంధించి ఉండొద్దు. ప్రైవేట్‌ ఆస్తులైతే సంబంధిత స్థలం యజమాని నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి.

సభ ఏర్పాటు చేసే స్థలం శాంతిభద్రతల దృష్ట్యా అభ్యంతరకరం కాదని నిర్ధారించుకోవాలి. సభకు మైక్‌ వినియోగానికి పోలీసు శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. సభను అడ్డుకోవడం, గొడవ సృష్టించడం లాంటి ముప్పు కలిగించే శక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించి వారి సాయం తీసుకోవాలి.

ఊరేగింపుల్లో..
ప్రతి అభ్యర్థి తమ ఊరేగింపు ఆరంభమయ్యే సమయం, సాగే రూట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రదేశాలు, ముగింపు సమయం ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఊరేగింపు సాగే మార్గంలో, సమావేశాలు నిర్వహించే ప్రదేశాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని పోలీసు అధికారుల నుంచి నిర్ధారించుకోవాలి. అభ్యంతరాలుంటే మార్గం మార్చుకోవాలి. ఊరేగింపుల్లో అందరూ పోలీసులు సూచించిన విధంగా రోడ్డుకు ఒక పక్కన సాగుతూ క్రమ శిక్షణతో మెలగాలి.

వేర్వేరు పార్టీలు ఒకే మార్గంలో, ఒకే సమయంలో ఊరేగింపులు తీయడానికి పోలీసులు అనుమతించరు. ఒకరికొక్కరు ఎదురు పడకుండా చూసుకోవడం ఉత్తమం. ఊరేగింపుల్లో పాల్గొనేవారు ఏ విధమైన మారణాయుధాలు, విపరీత శబ్దాలు కలిగించే పేలుడు పదార్థాలు వెంట తీసుకురాకుండా అభ్యర్థులు, వారి అనుచరులే చూసుకోవాలి. ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో ప్రతిపక్షాల దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలి.
ఇవి చదవండి: సెంటిమెంట్‌ ‘ఇలాఖా’గా పేరున్న గజ్వేల్‌లో.. నువ్వా.. నేనా!?

Advertisement
 
Advertisement