చారిత్రక ద్వీపంలో చిట్టడవి!
ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్.. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నెలవు. అరుదైన కట్టడాలకు వేదిక. ఎన్నో ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలకు చిరునామాగా ఉంటూ ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడి ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ఎత్తైన భారీ వృక్షాలు, తీరొక్క పంట్ల తోటలతో చిట్టడవిగా రూపుదిద్దుకుంది. ఈ చిట్టడివి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. ఆదివారం వస్తే చాలు.. నగరం నుంచి చాలా మంది యువత ఇక్కడికి వస్తున్నారు. అద్భుత పూల వనాలు, పండ్లతోటలు, ఎత్తైన వృక్షాలు, ఆహ్లాదకర వాతావరణాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతం షూటింగ్ స్పాట్‌గా మారింది. ఆ పక్కనే రంగుల పూల వనం.. మరో పక్క పక్షుల కిలకిల రాగాలు.. అలా నడుచుకుంటూ మరింత ముందుకెళ్తే సముద్రాన్ని తలపించేలా చెరువు కనిపిస్తుంది. ఈ వేసవికి విహార యాత్రలకు సుదూర ప్రాంతాలకు పరుగులు పట్టాల్సిన పని లేదు. మన చెంతనే ఉన్న ఈ అటవీ ద్వీపంలోనే ఎంజాయ్ చేయొచ్చు..
అందాలను ఆస్వాదిద్దాం..
చారిత్రక ఖిలా వరంగల్ మధ్య కోట ప్రకృతి సౌందర్యంతో ద్వీపంలా ఉంటుంది. కోట చుట్టూ రెండు నీటి కోటలు, అనేక వంపులతో కూడిన మట్టి, రాతికోట నిర్మాణ శైలి అద్భుతంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్క్, బోట్ షికారు, గుండు చెరువు కట్టపై ఏర్పాటు చేసిన పార్కు మాత్రమే చూశాం. ఇప్పుడు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన వృక్షాలతో సహజ సిద్ధ అడవి రూపుదిద్దుకుంది. నాలుగేళ్ల క్రితం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాటిన మియావాకి మొక్కలు నేడు దట్టమైన అడవిగా తయారైంది. ఈ మార్గానికి ఇరువైపులా 20 ఫీట్ల ఎత్తుతో దట్టంగా వృక్షాలు ఉన్నాయి. ఒక్కసారి ఇందులోకి వెళ్లిన వారు దారి తెలియక ఇబ్బంది పడాల్సిందే. ఇందులో పర్యాటకులు సేదదీరేలా అవకాశాలు ఉన్నాయి. పార్కు నిర్వాహకుడు మరో 18 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని రకాల పండ్ల మొక్కలు నాటారు. ఏకశిల గుట్ట పక్కన గుండు చెరువు కట్టపై 25 ఏళ్ల క్రితం ‘కుడా’ఆధ్వర్యంలో ఏకశిల వాటర్ పాల్స్, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయగా.. చెరువు చుట్టూ బాండ్ ఏర్పాటు చేశారు. విశాల స్థలంలో పర్యాటకులు టెబుల్ మీద కూర్చుని చల్లని గాలి ఆస్వాదిస్తూ .. చెరువు అందాలు వీక్షిస్తూ పచ్చిన చెట్ల నీడన ప్రకృతి అందాలను చూడొచ్చు. అంతేకాదు పార్కులో చెట్లు, పూల వనం, రోజ్ గార్డెన్, పాత్‌వేలు, సీసీ రోడ్లు, నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. దీంతో వేసవిలో పర్యాటకులు పచ్చని చెట్ల నీడన ఎంజాయ్ చేస్తున్నారు.
కోటకు ఇలా చేరుకోవచ్చు..
చారిత్రక ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు. రై ల్వేస్టేషన్, బస్సు స్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మధ్యకోట పర్యాటక ప్రాంతానికి రూ. 20 చార్జి చెల్లించి ప్రైవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు. నేరుగా స్వయంభూ శంభులింగేశ్వరుడిని దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత కాకతీయుల శిల్పకళా సంపద వీక్షించొచ్చు. అనంతరం చిల్డ్రన్ పార్కులో సేదదీరుతూ ప్రకృతి అందాలు చూడొచ్చు.
ఎత్తైన భారీ వృక్షాలు,
తీరొక్క పండ్ల తోటలు
చెట్లపై సేదదీరుతున్న అనేక రకాల పక్షులు
ఏకశిల చిల్డ్రన్స్ పార్కులో
రూపుదిద్దుకున్న పచ్చని ప్రాంతం
చారిత్రక ద్వీపంలో చిట్టడవి!
చారిత్రక ద్వీపంలో చిట్టడవి!


