విద్యారంగం అభివృద్ధికి కృషి
జనగామ రూరల్: విద్యారంగం అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని మాంగళ్య ఫంక్షన్‌హాల్‌లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల పీఆర్సీ, టీఏ, డీఏలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, కారుణ్య నియామకాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన వేళలను సవరించాలని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యారంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, పేదలకు నాణ్యమైన విద్యనందించడంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. ‘పార్లమెంట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రసంగం చూశాం.. అంబేడ్కర్ అంటే ఏమొస్తది.. దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారు.. చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటదా నరకం ఉంటదా మనకు తెలియదు.. కానీ, బతికున్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకుని జ్ఞానాన్ని నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు’ అని పేర్కొన్నారు. జనగామ ఎమెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ నాయకత్వంతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని పేర్కొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ నాగేశ్వర్, రాష్ట్ర నాయకులు మోత్కూరు నరహరి, రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్, జాక్ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ శ్రీనివాస్‌రావు, పాలకుర్తి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రావు, ఆకుల శ్రీనివాస్‌రావు, జాక్ జిల్లా చైర్మన్ ఖాజాషరీఫ్, జిల్లా అద్యక్షుడు కోర్రె లీయస్, నిర్వాహకులు మడూరి వెంకటేశ్, విద్యావేత్తలు, 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదట జనగామ చౌరస్తా నుంచి మాంగళ్య ఫంక్షన్‌హాల్ (సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం), రావెళ్ల రాఘవయ్య వేదిక వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వేల మందితో ర్యాలీ చేపట్టారు.
ప్రమాదంలో ఉపాధి హామీ చట్టం..
ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కోట్లాది కుటుంబాలు సంక్షోభంలోకి కూరుకుపోయే అవకాశముందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం పేదల హక్కులను రక్షించే స్పష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈరోజు అది ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, చట్టాన్ని కాపాడుకోవడం అంటే పేదల హక్కులను కాపాడుకోవడమేనన్నారు. దీనిపై మేధావులు ప్రజలకు అవగాహన కల్పించా ల్సిన అవసరం ఉందన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సులో మంత్రి ిసీతక్క


