అదనపు కట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు
●పోలీసులు న్యాయం చేయండి
● వీడియో ద్వారా బాధితురాలి వేడుకోలు..
ఐనవోలు: నా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు.. దీనిపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితురాలు వీడియోలో చెబుతున్న వివరాల ప్రకారం.. మండలంలోని కక్కిరాలపల్లికి చెందిన రాపోలు కేతమ్మ, వెంకటయ్య దంపతుల కుమార్తె, బాధితురాలు సుమలతకు ఏడేళ్ల క్రితం ఒగులాపురం గ్రామానికి చెందిన బోసు సాంబరాజుతో వివాహమైంది. మద్యానికి బానిసైన సాంబరాజు.. భార్య సుమలతను కొట్టడంతోపాటు ఆమె బంగారు ఆభరణాలను అమ్ముకుని జల్సాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అదనపు కట్నం తీసుకువాలని వేధించడంతో సుమలత కొన్ని రోజుల క్రితం తన తల్లిగారి ఇంటికి చేరుకుంది. అనంతరం ఐనవోలు పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. జఫర్‌గఢ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో దమ్మన్నపేటలో ఇరువురి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడానికి వెళ్లగా సుమలత, ఆమె తల్లిదండ్రులపై సాంబరాజు దాడి చేయించాడు. ఈ ఘటనపై సుమలత వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై.. సాంబరాజును పిలిచి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. ఈ ఘటనపై ఇప్పటికై నా ఐనవోలు, వర్ధన్నపేట పోలీసులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరింది. ఈ అంశంపై ఐనవోలు ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఐదు రోజుల క్రితం సుమలత ఫిర్యాదు చేసిందన్నారు. 498 కేసు నమోదు చేస్తానని చెబితే నిరాకరించిందన్నారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో భార్య, భర్తలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపారు.


