చవితి పందిళ్ల నిర్వహణపై కృష్ణా జిల్లా ఎస్పీ దిశానిర్దేశం
కోనేరుసెంటర్: జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేందుకు ఉత్సవ కమిటీలు, పందిళ్ల నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని అందుకు అవసరమైన ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సూచించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణ, మత సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ సూచించే నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోండి..
విగ్రహాలను మండపాల వద్దకు తీసుకువెళ్లే సమయంలో ర్యాలీలు, ఊరేగింపులు లేకుండా తీసుకువెళ్లాలని, ఆ సమయంలో జన సమీకరణ చేసి రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని ఎస్పీ తెలిపారు. ఉత్సవ కమిటీలు https://ganeshutsav.net/ వెబ్‌సైట్‌లో తమ వివరాలు, విగ్రహం ప్రతిష్టించే ప్రదేశం, సంబంధిత పత్రాలను సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. ప్రైవేట్ స్థలంలో మండపం ఏర్పాటు చేస్తే స్థల యజమాని అనుమతి, పబ్లిక్ ప్రాంతాల్లో అయిదే సంబంధిత గ్రామ పంచాయతీ, నగరంలో అయితే మున్సిపాలిటీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ శాఖతో పాటు అవసరమైన ఇతర సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేలా బాధ్యతలను కేటాయించుకోవాలని తెలిపారు.


